ఈసారి గద్దె ఎక్కితే అన్నివర్గాల సంక్షేమాన్ని, ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకుంటూ ప్రభుత్వం పాలన సాగిస్తుందని ఎన్నికలకు ముందునుంచి చంద్రబాబునాయుడు సంకేతాలు ఇస్తూనే వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఆయన ఎన్నికల హామీల కూడా వచ్చాయి. ప్రజలు ఆ హామీలను నమ్మారు. రాష్ట్ర చరిత్రలోనే అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు సామాన్య ప్రజలందరితోపాటు, అన్ని వర్గాల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ముందుకు వెళుతున్నారు. తాజాగా ఉపాధ్యాయ వర్గాల్లో ప్రభుత్వం పట్ల నమ్మకం పెరిగేలా, ఆదరణ పెరిగేలా వ్యవహరిస్తుండడం గమనార్హం.
చంద్రబాబునాయుడు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో టీచర్ల వర్క్ ఎడ్జస్ట్‌మెంట్ గురించి తాజాగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. విద్యార్థుల స్ట్రెంగ్త్ తక్కువగా ఉన్న స్కూళ్ల నుంచి ఎక్కువగా ఉన్న స్కూళ్లకు టీచర్లను తాత్కాలికంగా సర్దుబాటు చేసే ప్రక్రియ ఇప్పుడు మొదలవుతోంది. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఒక విడత విధివిధానాలను విడుదల చేసింది. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలకు విలువ ఇస్తూనే వాటిని రూపొందించారు. వాటిపై కూడా మరికొన్ని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆ వర్గాలతో విడతలుగా చర్చలు జరుపుతూ.. రూపొందిన విధివిధానాల్లో కొన్ని సడలింపులు, మార్పుచేర్పులు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది.
సరిగ్గా ఇలాంటి పోకడను రాష్ట్రంలోని ఉపాధ్యాయులు రుచిచూసి సుమారు అయిదేళ్లు గడచిపోయాయి. జగన్మోహన్ రెడ్డి ప్రతి నిర్ణయం విషయంలోనూ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లు అన్నట్టుగా వ్యవహరించారు. టీచర్లతో ప్రతి విషయంలోనూ సున్నం పెట్టుకున్నారు. వారి వినతులను, వేడికోళ్లను బుట్టదాఖలు చేశారు. తన ఒంటెత్తుపోకడలతో వారిలో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. జగన్ సర్కారుకు తమ సర్కారుకు మౌలికమైన తేడా ఏమిటో చంద్రబాబు సర్కారు ప్రజలకు రుచిచూపిస్తోంది. తమ ప్రభుత్వం ఎంత ప్రజాస్వామికంగా ఉండగలదో తెలియజెబుతోంది. నిర్ణయాల్లో ఉపాధ్యాయ వర్గాల అభిప్రాయాలకు కూడా విలువ ఇస్తోంది. ఇలా చేస్తే.. ఆ వర్గాల నుంచి ప్రభుత్వానికి హర్షామోదాలు వ్యక్తం కాకుండా ఉంటాయా? అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇలా చేస్తే టీచర్లు జై కొట్టకుండా ఉంటారా?
Thursday, November 14, 2024