వాళ్లు వద్దంటోంటే ఇవ్వడమెందుకు బాబుగారూ!

Saturday, March 22, 2025

తిరుమల వెంకటేశ్వర స్వామి దైవదర్శనానికి వెళ్లే సమయంలో సిఫారసు పత్రాలను, ప్రోటోకాల్ దర్శనాలను అనుమతించాలని,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులను, టీటీడీని ఎందుకు బతిమిలాడాలి? అసలు తిరుమలకు మాత్రమే ఎందుకు వెళ్లాలి? మన రాష్ట్రంలో ఉన్న యాదగిరిగుట్టకు, భద్రాచలానికి, అనేక శివాలయాలకు వెళితే సరిపోతుంది కదా!’ అని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇప్పుడు ఉభయరాష్ట్రాలలో సంచలనం రేపుతున్నాయి. తిరుమల ప్రపంచంలోనే అతి గొప్ప హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం అనే సంగతి అందరికీ తెలిసినదే. దాని ప్రాధాన్యాన్ని, ఆధ్యాత్మిక విశిష్టతను కూడా కించపరిచే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు.. టీటీడీ అనుమతించే సిఫారసు ఉత్తరాలే తమకు అవసరం లేదని అంటున్నప్పుడు.. వారికి ఎందుకు వెసులుబాటు కల్పించాలి అని ఇప్పుడు ఏపీ వాసులు వాదిస్తున్నారు. తెలంగాణ నాయకుల సిఫారసు పత్రాలను అనుమతించే నిర్ణయంపై ప్రభుత్వం, టిటిడి పునరాలోచించాలని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ చట్టసభల ప్రతినిధులకు ప్రోటోకాల్ దర్శనాలు కల్పిస్తూనే ఉన్నారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులకు ఇప్పటికీ ఎలాంటి లోటు జరగడం లేదు. వారి గౌరవానికి భంగం వాటిల్లడం లేదు. అయితే కరోనా తర్వాత వారు సిఫారసు ఉత్తరాలు ఇచ్చే అధికారాన్ని మాత్రమే కోల్పోయారు. దానికోసం వారు ఆరాటపడటంలో కూడా అర్థం లేదు. అయితే తిరుమల దర్శనానికి ఉత్తరాలు ఇవ్వడం అనేది ఒక ప్రివిలేజ్ గా భావించే నాయకులు అందుకోసం వెంపర్లాడారు. ఏదైతేనేం మొత్తానికి ఏపీ ప్రభుత్వం తెలంగాణ నాయకుల సిఫారసులను కూడా అనుమతించాలని ఆదేశించింది. తీరా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలాంటి విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు వారి సిఫారసులను ఎందుకు అనుమతించాలి అనే వాదన తలెత్తుతోంది.

నిజంగా తమ నియోజకవర్గ ప్రజలకు, తమ ఆత్మీయులకు సిఫారసు పత్రాలు ఇచ్చి పంపే నాయకులు కొందరే! ఉత్తరాలు ఇచ్చే హోదాలో ఉన్న అనేకమంది తిరుపతి తిరుమలల్లో ఏజెంట్లను నియమించుకుని బ్లాక్ మార్కెట్లో లెటర్లు  అమ్ముకుంటూ ఉంటారనేది అందరూ ఎరిగిన సంగతి. గతంలో కొంతమంది తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇలాంటి అక్రమ దందాలు సాగిస్తూ పట్టుబడ్డారు కూడా. ఒక తెలంగాణ ఎమ్మెల్సీ ఉత్తరాదికి చెందిన ఒక భక్త బృందాన్ని తన వెంట తీసుకుని వెళ్లి– ప్రోటోకాల్ దర్శనం చేయించడం ద్వారా ఆ టికెట్లను భారీ మొత్తానికి అమ్ముకున్న వైనం కూడా గతంలో వెలుగు చూసింది. ఇలాంటి నేపథ్యంలో అసలు వీరందరికీ సిఫారసు ఉత్తరాల అధికారం ఎందుకు ఇవ్వాలి అనేది  మీమాంస. 

చంద్రబాబు నాయుడు ఈ విషయంలో పునరాలోచించాలని, వారికి ఇచ్చిన వెసులుబాటును రద్దు చేయడం వలన కనీసం వెయ్యి మంది సామాన్య భక్తులకు మంచి దర్శనం అదనంగా కల్పించవచ్చునని భక్తులు కోరుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles