పారదర్శకంగా ఎన్నికలు జరిగితే, ప్రజలు నిజంగానే ఇళ్లలోంచి బయటకు వచ్చి ఓట్లు వేయడం అంటూ జరిగితే.. తమ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో.. తమ అడ్డగా చెప్పుకునే కడప జిల్లాలో, పులివెందుల నియోజకవర్గంలో కూడా ఎంత దుర్భరంగా ఉంటుందో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుభవంలోకి వచ్చింది. మొత్తం అన్ని స్థానాల్లోనూ రీపోలింగ్ కోరిన వారే.. రెండు కేంద్రాల్లో రీపోలింగ్ పెడితే.. బహిష్కరిస్తున్నాం అంటూ నాటకాలు ఆడడం గమనించాల్సిన సంగతి. తెలుగుదేశం పార్టీ పోలీసుల మద్దతులో దొంగఓట్లు వేసుకున్నది. వేల మంది ప్రజలను బయటిప్రాంతాలనుంచి తెప్పించి.. ఓట్లు వేయించుకున్నారు అని ఆరోపించడం ద్వారా మాత్రమే వారు నెగ్గగలుగుతున్నారు.. అని తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. దాని అర్థం ఏమిటి? ఫలితాలు వెలువడే సరికి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా నీచంగా ఓడిపోవాలి. అలాకాకుండా వారికి ఏమాత్రం గౌరవప్రదంగా ఓట్లు వచ్చినా సరే.. వారు రెండు మూడురోజులుగా అత్యంత నీచమైన బుద్ధితో తప్పుడు ప్రచారం చేసినట్టుగా అనుకోవాలి.
పులివెందుల మండల జడ్పీటీసీ ఎన్నిక విషయం గమనిద్దాం. ఇక్కడ ఇప్పటిదాకా అన్ని ఎన్నికలు ఏకగ్రీవంగా మాత్రమే జరిగాయి. రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పటినుంచి కూడా.. తమకు వ్యతిరేకంగా ఎవ్వరూ నామినేషన్ కూడా వేయకుండా భయపెడుతూ.. వారు రాజకీయం చేశారు. కేవలం ఏకగ్రీవంగా మాత్రమే నెగ్గుతూ వచ్చారు. 2016లో మాత్రమే తెలుగుదేశం తరఫున ఒక నామినేషన్ పడింది. ఆ వ్యక్తిని కూడా ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత తమ పార్టీలో కలిపేసుకోవడం ద్వారా.. తెలుగుదేశానికి ఎన్నికల ప్రచారం కూడా లేని పరిస్థితి కల్పించారు జగన్.
అంత ఘోరంగా వారు తెలుగుదేశాన్ని అవమానం పాల్జేయాలని అనుకున్నప్పటికీ అప్పటికి ఆ మండలంలో ఉన్న 8వేల ఓట్లలో తెలుగుదేశానికి 2600 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు పులివెందులలో మొత్తం ఓట్లు పదిన్నర వేలదాకా ఉన్నాయి. పెరిగిన ఓట్లు దామాషా ప్రకారం తెదేపా ఓట్లు కూడా పెరిగి ఉంటాయని అనుకుంటే కనీసం మూడున్నర వేలకు పైగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో పతనం అయిన తీరు, ఆయన సొంత నియోజకవర్గంలో కూడా గతంతో పోలిస్తే తగ్గిన మెజారిటీ, ఎన్నికల తర్వాత ఆయన వ్యవహార సరళితో విసిగి వేసారిపోయిన ప్రజలు, జగన్ కంటె చంద్రబాబు పాలన జనరంజకంగా ఉన్నదని కూటమి ప్రభుత్వంవైపు ఆకర్షితం అవుతున్న తీరు అవన్నీ కలిసివచ్చే అంశాలని అనుకుంటే గనుక.. తెలుగుదేశం ఇక్కడ విజయం సాధిస్తుంది. ఈ నియోజకవర్గంలో 8102 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ముందే చెప్పుకున్నట్టు తెలుగుదేశానికి స్థిరమైన ఓటు బ్యాంకే 4000 వరకు ఉంది. ప్రస్తుత పరిణామాల్లో కొన్ని ఓట్లు కలిసినా వారు నెగ్గుతారు.
వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా రిగ్గింగ్ జరిగిఉంటే జగన్ దళాలు అత్యంత నీచంగా వెయ్యి కంటె తక్కువ ఓట్లతో ఓడిపోవాలి. అలా కాకుండా ఏదో కొంత ఓట్లు సంపాదించుకుని, తెదేపా చేతిలో ఓడితే.. వారు ఇన్నాళ్లు చేసిన ప్రచారమే నీచమైనదని అనుకోవాలని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
నీచంగా ఓడిపోకుంటే.. వారి బుద్ధే నీచం అని లెక్క!
Monday, December 8, 2025
