హాస్టళ్లు బాగుపడుతోంటే.. వైసీపీ ఏడుపెందుకు?

Friday, December 5, 2025

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వినూత్నమైన ఆలోచనలతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన పనులన్నీ కేవలం ప్రభుత్వం మాత్రమే చేయాలని అనుకోకుండా.. ఉత్సాహం ఉన్న ఔదార్యం ఉన్న సంపన్నులను కూడా ఈ క్రతువులో భాగస్వాముల్ని చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్రజల జీవితాలను బాగుపరచడంలో సంపన్నులు చేయూత అందించే పీ4 విధానం ఇప్పటికే అనేక సత్ఫలితాలను ఇస్తోంది. తాజాగా బీసీలు, ఎస్సీలకోసం నిర్వహిస్తున్న హాస్టళ్లను కూడా పీ4 విరాళాలతో మరింత మెరుగ్గా నిర్వహించేందుకు ప్రభుత్వం పూనుకుంది. అయితే.. ఈ నిర్ణయం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. హాస్టళ్లకు ఏదో ద్రోహం జరిగిపోతున్నట్టుగా గగ్గోలు పెడుతున్నారు. హాస్టళ్లు బాగుపడితే.. ప్రభుత్వానికి మంంచి పేరు వస్తే.. తమకు రాజకీయ భవిష్యత్తు లేకుండాపోతుందనే భయాన్ని వారు మరో రకంగా ప్రదర్శిస్తున్నారు.

రాష్ట్రంలోని హాస్టళ్లను కూడా పీ4 పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీ4 అనే విధానం ఇప్పటికే అనేక రకాలుగా సత్ఫలితాలను ఇస్తోంది. పీ4 విరాళాలతో అనేక జీవితాలు బాగుపడుతున్నాయి. అనేక అభివృద్ధి పనులు, నిర్మాణాత్మక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఒకవైపు పీ4 రూపంలో దాతల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు మరిన్ని విభాగాలకు విస్తరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోంది. ఇందులో భాగంగానే విద్యార్థుల వసతిగృహాలను కూడా పీ4 పరిధిలోకి తీసుకురావడానికి నిశ్చయించారు.

పేదరికం నుంచి ఉన్నత స్థానాలకు ఎదిగిన వాళ్లు తాము చదువుకున్న పాఠశాలలు, తమ స్వగ్రామాల్లో పనులు చేపట్టడానికి ఎంతైనా వెచ్చించడానికి సిద్ధం అవుతున్న రోజులివి. అలాంటి వారి ఔదార్యాన్ని మరింత విస్తృతంగా వాడుకోవడానికి హాస్టళ్లను కూడా ఆ పరిధిలోకి తెచ్చారు. పీ4 నిధులతో హాస్టళ్లను మెరుగుపరచి ఆధునిక సౌకర్యాలు కల్పిస్తారు. విద్యార్థులకు ఉపయోగపడేలా ఇతర ఏర్పాట్లు చేస్తారు. దాతల ఆలోచనలను బట్టి.. వారికి హాస్టళ్లలో చదువులకు సహకరించేందుకు ట్యూషన్లు చెప్పగల వారిని కూడా ఏర్పాటుచేస్తారు. ఇలా ఎన్నయినా జరగొచ్చు.

అయితే హాస్టళ్లకు పీ4 వర్తించే ఆలోచన బయటకు రాగానే.. వైసీపీ గగ్గోలు పెట్టడం ప్రారంభించింది. విద్యార్థుల హాస్టళ్లను ప్రెవేటీకరించడానికి కుట్రలు జరుగుతున్నాయంటూ వారు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. తద్వారా … ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల ప్రజల్లో కొత్త అనుమానాలు పుట్టించడానికి కుట్రలు చేస్తున్నారు. అంతిమంగా వారి దుర్బుద్ధి బయటపడుతోంది. హాస్టళ్లు బాగుపడి, హాస్టళ్లలో చదువుకునే విద్యార్థుల్లో కూడా చంద్రబాబునాయుడు పరిపాలన, ఎన్డీయే కూటమి ప్రభుత్వం పట్ల గౌరవం ఏర్పడితే.. భవిష్యత్తులో ఎప్పటికీ తమకు ఠికానా లేకుండా పోతుందని వారు భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది. వారి రాజకీయ స్వార్థం కోసం ప్రభుత్వం చేసే మంచి పనులకు అడ్డుపడడం మంచిది కాదని ప్రజలంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles