ఒక చిన్నపాటి నగరం. అప్పుడప్పుడే కొద్దిగా కొద్దిగా విస్తరిస్తున్న ఒక కాలనీ. ఎవ్వరో ఎన్నడో వెంచర్ వేసి.. ప్లాట్లు అమ్మేశాడు. రోడ్లు గట్రా రాకపోయినప్పటికీ.. ఒక్కరొక్కరుగా అక్కడ ఇళ్లు కట్టుకున్నారు. మెయిన్ రోడ్ పక్కగా ఉండే స్థలాల్లో ఇంకా ఎవరూ కట్టలేదు. ఈలోగా ఒక పెద్దమనిషి వచ్చాడు. ఖాళీగా ఉన్న స్థలాలు అన్నీ నావే అన్నాడు. అంతే కాదు.. కట్టేసిఉన్న ఇళ్లకు వెళ్లే దారి కూడా దారికి అడ్డంగా ఏకంగా గోడ కట్టేసాడు. ఇళ్లు కట్టుకున్న వారికి పాట్లు మొదలయ్యాయి. గోడ దూకి ఇంటికి పోవడం లాంటి పనులు కొన్నిరోజులు చేశారు. చివరికి.. దౌర్జన్యంగా గోడ కట్టిన అతనితో చర్చలకు వెళ్లారు. సదరు పెద్దమనిషి రోడ్డుకు తన స్థలం వదలడానికి కోట్లు డిమాండ్ చేశాడు. ఎక్కడో ఒకచోట బేరం తెగింది. డబ్బు పుచ్చుకున్నాడు. దారి వాడుకోండి.. అని దయతలచి గోడ కూల్చాడు.
ఆ తర్వాత అసలు డ్రామా మొదలైంది. మున్సిపాలిటీల్లో ఫైలు కదిపాడు. పాపం వారికి దారి లేదని జాలి చూపించాడు. తన స్థలం ఇస్తానని ఔదార్యం చూపించాడు. ప్రభుత్వం మార్కెట్ ధరకు మించి లెక్కకట్టి టీడీఆర్ బాండ్లు పుచ్చుకున్నాడు. పరిహారం ప్రభుత్వం నుంచి పొందాడు.
ఇక్కడ మర్మం ఏమిటి అంటే.. ఆ కాలనీలోని ఇళ్ల వారిని బెదిరించి, దారి లేదని భయపెట్టి తీసుకున్న డబ్బు పాపం ఆ చోటా నాయకుడి రెక్కల కష్టం. ఆ సొమ్ము ఆయనదే. అసలు ఈ అర్హతా లేని ఆయనకు.. టిడిఆర్ బాండ్ల రూపంలో దక్కింది మొత్తం.. ఆ పరిహారం ఇప్పించిన బడా నేత ఖాతాలోకి వెళ్తుంది.
కథ లాగా కనిపించినప్పటికీ..ఆ టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో అచ్చంగా జరిగింది ఇదే. బినామీల పేరుతో నాయకులు అడ్డంగా దోచుకున్నారు. సెప్టెంబరు నెలాఖరులోగా ఈ బాండ్ల రూపంలో వైసీపీ నేతలు ఎంత మొత్తం స్వాహా చేశారో వివరాలు బయట పెడతామని మంత్రి నారాయణ అంటున్నారు. కేవలం అధికారికంగా బాండ్లు పొందిన బినామీలను విచారించడంలో తెరవెనుక సూత్రధారులు పేర్లు రాబడితే భూ బకాసురుల లెక్క తేలుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.