వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డిని హత్యచేయడంలో కీలకంగా వ్యవహరించి.. ఆ తర్వాత పోలీసులకు అప్రూవర్ గా మారిన వ్యక్తిని ప్రలోభ పెట్టడానికి ఏకంగా 20 కోట్ల రూపాయల ఆఫర్ పెట్టారంటే.. అందుకోసం సినిమా ఫక్కీలో, జైలులో వైద్యశిబిరం పేరిట పెద్ద డ్రామా నడిపించారంటే.. అసలు నిందితులు ఎంతగా కంగారు పడుతున్నారో.. సులభంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే.. వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షులు అందరూ ఒక్కరొక్కరుగా ఇప్పటికే కడతేరిపోతుండడాన్ని గమరనిస్తే కూడా అసలు నిందితుల కర్కోటకత్వంపై అనేక అనుమానాలు కలుగుతాయి. అలాంటి పరిస్థితిల్లో.. హత్య కేసులోని మరో కీలక నిందితుడుగా కూడా అడ్డం తిరిగితే.. అసలు నిందితుల పరిస్థితి ఏమవుతుంది? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బాగా నడుస్తోంది. వివేకా హత్య వెనుక కీలక సూత్రధారిగా ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో.. హత్యలో పాల్గొన్న నిందితుడిగా ఆరోపించబడి, ప్రస్తుతం బెయిలుమీద బయట ఉన్న సునీల్ యాదవ్.. వైసీపీ నాయకులమీదనే తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.
ఇటీవల విడుదలైన ‘హత్య’ సినిమాలో తనను, తన తల్లి కేరక్టర్ ను చాలా అవమానకరంగా చిత్రించారని ఆయన అంటున్నారు. వ్యక్తిత్వ హననం చేస్తున్నారనేది ఆయన ఆరోపణ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులనుంచి, తన సహ నిందితుల నుంచి తనకు ప్రాణాపాయం ఉన్నదని, తనను కూడా అందరు సాక్షుల మాదిరిగానే చంపుతామని బెదిరిస్తున్నారని సునీల్ యాదవ్ కొ న్ని రోజుల కిందట ఎస్పీకి ఫిర్యాదు చేశారు కూడా! ఇప్పుడు తనతోపాటు తన తల్లి వ్యక్తిత్వాన్ని కించపరిచారని హత్య సినిమా గురించి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సినిమా ప్రదర్శనలు జరగకుండా అడ్డుకోవాలని కోరుతున్నారు.
‘హత్య’ అనే సినిమాను అచ్చంగా.. అవినాష్ రెడ్డి అమాయకుడని చాటడం కోసమే తీశారని దానిని చూసిన ఎవ్వరికైనా అర్థమవుతుంది.చాలా జాగ్రత్తగా సినిమాను ముందుకు తీసుకువెళుతూ.. అంతిమంగా.. సునీత భర్త రాజశేఖర రెడ్డి తన మామయ్యను ఆస్తులు చేజారకుండా ఉండడకోసం చంపంచినట్టుగా నిరూపించే ప్రయత్నం ఈ సినిమాలో సాగినట్టు ప్రజలు అనుకుంటున్నారు. ఈ క్రమంలో సునీల్ యాదవ్ పాత్రను క్రూరంగా చిత్రీకరించడమే కాదు.. అతని తల్లి వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచేలా చేశారు. అందుకే ఇప్పుడు ఆయన మనస్తాపానికి గురవుతున్నారు. అసలే ఒక నిందితుడు దస్తగిరి అప్రూవర్ గా మారినందుకు.. హత్య కేసులోని అసలు నిందితులు తలకిందులు అవుతున్నారు. అలాంటిది మరో నిందితుడు సునీల్ యాదవ్ కూడా అడ్డం తిరిగితే, సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ కు మరింత గడ్డు పరిస్థితులు తప్పవేమో అని ప్రజలు అనుకుంటున్నారు. హత్య సినిమా స్క్రిప్టు వంటకం.. సినిమాలో అవినాష్ ను అమాయకుడిగా తేల్చినా.. వాస్తవంలో ఇబ్బంది పెట్టేలాగానే ఉన్నదని అంటున్నారు.
సునీల్ కూడా అడ్డం తిరిగితే అవినాష్ గతేమిటి?
Wednesday, March 26, 2025
