పీఎస్సార్ ఆంజనేయులు కోసం జగన్ దళాలు పరితపించిపోతున్నాయి. ఆయన మహానుభావుడని, మహా మహితాత్ముడని ప్రజలను నమ్మించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాదంబరి జత్వానీ అరాచకంగా అరెస్టు చేసి, ఆమె కుటుంబం మొత్తాన్ని 42 రోజుల పాటు రిమాండులో పెట్టి హింసించిన వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్ లు నిందితులు కాగా, ఆ ముగ్గురూ సస్పెండు అయ్యారు. ఇద్దరు ఐపీఎస్ లు కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిలు తెచ్చుకున్నారు. అయితే పీఎస్సార్ ఆంజనేయులు ముందస్తు బెయిలు కోసం ప్రయత్నం కూడా చేయలేదు. పిటిషను కూడా వేయలేదు. తనను అరెస్టు చేస్తానని వారం ముందే తెలుసని చాలా బింకంగా పోలీసులకు చెప్పిన పీఎస్సార్ ఆంజనేయులు ముందస్తు బెయిలు ప్రయత్నం కూడా చేయలేదు. ఈ ధీమా.. ఆయనలోని సత్యసంధతకు, నిజాయితీకి నిదర్శనం అన్నట్టుగా ఇప్పుడు జగన్ కరపత్రిక, ఆయనకు భజన చేస్తూ బతికే నీలి మీడియా బృందాలు ప్రచారం చేస్తున్నాయి.
తాను తప్పు చేయలేదు అనే నమ్మకం ఉన్న నిజాయితీ పరుడు గనుక- పీఎస్సార్ ఆంజనేయులు ముందస్తు బెయిలు కోసం ప్రయత్నం కూడా చేయలేదని ఆ దళాలు అడ్డగోలు వాదనలు లేవనెత్తుతున్నాయి.
ఒక్క క్షణం వారు చెబుతున్న వాదన నిజమే అనుకుంటే గనుక దాని అర్థం ఏమిటి? తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే.. ముందస్తు బెయిలుకోసం అప్లయి చేయరన్నమాట! మరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పదుల సంఖ్యలో సీనియర్ నాయకులు, కొమ్ములు తిరిగిన నాయకులు అందరూ.. పదేపదే ముందస్తు బెయిలు కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ భంగపడుతున్నారు.. మరి దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం పార్టీలో నెంబర్ టూ అయినటువంటి సజ్జల రామక్రిష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవరెడ్డి, మాజీ మంత్రులు కాకాణి గోవర్దనరెడ్డి, విడదల రజని, ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి ఇతరత్రా నిందితులు వైసీపీకి చెందిన కేసుల్లోకి వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా.. ముందస్తు బెయిలు కోసం ప్రయత్నాలు చేయడం జరుగుతూనే ఉంది.
మరి వీరందరి ప్రయత్నాల గురించి.. జగన్ కరపత్రిక, నీలిమీడియాలు, జగన్ దళాల వాదనలు ఏమిటి? తప్పు చేయలేదు గనుక.. ముందస్తు బెయిలు కోసం అప్లయి చేయలేదు అని పీఎస్సార్ ఆంజనేయులకు కితాబులు ఇస్తున్న నేపథ్యంలో.. అదే ముందస్తు బెయిలు కోసం ఆరాటపడుతూ పరారీలో ఉంటూ అజ్ఞాతంలో గడుపుతున్న మిగిలిన పార్టీ నాయకులందరూ దుర్మార్గులు, తప్పు చేశారు గనుకనే బెయిలు కోసం ఆరాటపడుతున్నారు.. అని వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు భావిస్తున్నట్టేనా? పీఎస్సార్ ఆంజనేయులు వంటి ఒక్క మనిషిని సమర్థించడానికి ఒక కుటిలవాదన తయారుచేస్తే.. అదే వాదన ప్రకారం తమ పార్టీకే చెందిన అనేక మంది నాయకులను అపహాస్యం చేసినట్టు, ఎద్దేవా చేసినట్టు, తప్పుబట్టినట్టు అవుతుంది కదా.. అనే లాజిక్ ను వారు మిస్సవుతున్నారు.
పీఎస్సార్ గొప్పోడైతే.. సొంతవారు తప్పుడు మనుషులా?
Monday, December 8, 2025
