కసిరెడ్డి నోరు విప్పితే చిన పెద్దిరెడ్డికి దబిడి దిబిడే!

Saturday, April 12, 2025

ఏపీలో జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం దర్యాప్తు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. సిట్ చేస్తున్న దర్యాప్తు పరంగా.. అంతా తేలిపోతున్నదేమో అనే అభిప్రాయం కలగడం లేదు గానీ.. నిందితులైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పడుతున్న ఆందోళన, వారి టెన్షన్, వారు స్పందిస్తున్న తీరులను గమనిస్తే ఇలాంటి అభిప్రాయం కలుగుతోంది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కు అప్పట్లో ఛైర్మన్ గా ఉన్న వాసుదేవరెడ్డిని ఆల్రెడీ విచారించిన తర్వాత.. సిట్ దర్యాప్తు బృందం ఇప్పుడు కీలక పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని విచారించేందుకు సిద్ధం అవుతోంది. ఆయన అసలు విచారణనే ఎదుర్కోకుండా ఉండేందుకు మార్గాన్వేషణ చేస్తున్నారు గానీ.. అది అంత సులభం కాదు. కాగా, రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరై.. నోరు విప్పితే గనుక.. వేల కోట్ల రూపాయల స్వాహా పర్వాన్ని నడిపించడంలో తెరవెనుక ఉండిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కూడా ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

విచారణకు రమ్మని నోటీసులు పంపితే.. రాజ్ కసిరెడ్డి పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. రెండు నోటీసులకు అందుబాటులో లేకుండాపోయినా.. పోలీసులకు ఒక మెయిల్ పెట్టారు. అసలు నన్ను ఎందుకు రమ్మన్నారో వివరంగా చెబితే అప్పుడు ఆలోచిస్తా అనేది మెయిల్ సారాంశం. మద్యం కుంభకోణంలో సాక్షిగా విచారణకు అని సెలవిస్తే.. దానికి నాకు ఏం సబంధం అని అడుగుతున్నారు. జగన్ ప్రభుత్వానికి గతంలో తాను కేవలం ఐటీ సలహాదారునని, లిక్కర్ స్కామ్ గురించి నన్ను ఎందుకు విచారిస్తారని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఇలాంటి ధోరణిలో ఉండగా.. రాజ్ కసిరెడ్డికి పై స్థాయిలో మొత్తం బాగోతానికి అసలు సూత్రధారి అయిన పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి భయం ఇంకా తొలగిపోలేదు.

ఆయన పేరు నిందితుల జాబితాలో లేకపోయినా.. తన ముందస్తు బెయిలు కావాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ఆయన భంగపడ్డారు. వాళ్ల తండ్రి రామచంద్రారెడ్డిని పరామర్శించే నిమిత్తం అరెస్టు చేయకుండా ఆగాలని కోర్టు ఆదేశించిన గడువు కూడా దాటిపోయింది. ఏపీ పోలీసులు ఢిల్లీలో అడుగుపెడితేనే ఆయనకు వణుకు పుడుతున్నట్లుగా ఉంది.
మిధున్ రెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు ఢిల్లీ వెళ్లి కుట్రలు చేస్తున్నారంటూ తమ అనుకూల మీడియాలో వార్తలు అచ్చొత్తించుకుంటున్నారు. పోలీసులు మహా అయితే.. మిధున్ రెడ్డి కూడా సాక్షిగా విచారణకు రావాల్సి ఉంటుందని నోటీసులు ఇవ్వొచ్చు. కానీ.. వారిలో అమితంగా ఉన్న అరెస్టు భయం  ఇలాంటి అతి జాగ్రత్తల వైపు ప్రేరేపిస్తున్నట్టుగా ఉంది.
రాజ్ కసిరెడ్డి విచారణను తప్పించుకోవడం అసాధ్యంగా కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో.. ఆయన విచారణలో నోరువిప్పి వాస్తవాలు చెప్పాల్సి వస్తే.. లేదా, పోలీసుల వద్ద ఉన్న ఆధారాలకు నీళ్లు నమిలితే.. అప్పుడిక మిధున్ రెడ్డికి దబిడిదిబిడే అవుతుందని అంతా అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles