జగనన్న తరిమికొడితే.. ఆ తప్పునూ దిద్దుతున్నారు!

Sunday, March 30, 2025

ఎవ్వరైనా పాలకులుగా అధికారంలోకి వస్తే.. తమ ముద్ర కనిపించేలా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను తీసుకురావడం, కొత్త సంస్థలను ఆహ్వానించడంపై దృష్టి పెడతారు. తద్వారా.. తమ గురించి నలుగురూ పదికాలాల పాటు చెప్పుకుంటూ ఉండాలని ఆశిస్తారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూటే సెపరేటు! తాను ముఖ్యమంత్రి అయితే.. తన ముద్రతో కొత్త సంస్థలను తీసుకురావడం గురించి ఆయన పట్టించుకోరు. తనకంటె ముందు పనిచేసిన ముఖ్యమంత్రి ముద్రలు ఏవీ రాష్ట్రంలో ఉండకుండా చెరపివేయాలని ప్రయత్నిస్తారు. అందుకే అయిదేళ్లపాటు అంత ఘోరంగా విధ్వంసక పరిపాలన సాగించారు. ఆయన విధ్వంసక ప్రవృత్తికి బలైన వాటిలో విశాఖ నగరానికి రాదలచిన లులూ మాల్ కూడా ఒకటి! అయితే జగన్ విశాఖలో ఏర్పాటుకు సిద్ధం అవుతున్న లులు సంస్థను వెళ్లగొట్టారు. ఆ సంస్థకు కేటాయించిన భూములను కూడా వెనక్కు తీసుకుని వీఎంఆర్డీఏ వారికి అప్పగించేశారు. అయితే ఇప్పుడు ఆ పాపాన్ని కూడా కూటమి ప్రభుత్వం చక్కదిద్దుతోంది. తిరిగి అదే స్థలాన్ని లులుకు కేటాయిస్తూ.. మూడేళ్లలో గా కార్యకలాపాలు మొదలయ్యేలా 99ఏళ్ల లీజు ఒప్పందం కుదుర్చుకోనుంది.

2014-19 మధ్య కాలంలో ఏపీలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం.. అంతర్జాతీయంగా పేరుమోసిన లులు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దానికోసం విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కు భూములను కేటాయించింది. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు.. లులుకు కేటాయించిన భూములను రద్దు చేసింది. దీంతో పెట్టుబడుల ప్రతిపాదన ఉపసంహరించుకున్నట్టుగా లులూ ప్రకటించింది. ఇక ఎప్పటికీ ఏపీలో పెట్టుబడులు పెట్టబోం అని కూడా ప్రకటించింది.

కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ వారితో సంప్రదింపులు జరిపారు. తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు వారు ఒప్పుకున్నారు. వీఎంఆర్డీయే నుంచి తిరిగి 13.43 ఎకరాల హార్బర్ పార్కు భూములను ఏపీఐఐసీ కి బదలాయిస్తారు. 99ఏళ్ల లీజు ప్రాతిపదిక మీద లులూకు కేటాయించనున్నారు.
ఈ భూముల్లో చిల్డన్స్ ఎమ్యూజ్ మెంట్ పార్కు, ఫుడ్ కోర్టులు, 8 స్క్రీన్ లతో కూడిన ఐమ్యాక్స్ మల్టిప్లెక్స్ లను లులూ నిర్మించబోతోంది. వీటితో పాటూ అతిపెద్ద షాపింగ్ మాల్ కూడా ఏర్పాటు అవుతుంది. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్టుగా ప్రకటించిన తర్వాత.. లులూ సంస్థ హైదరాబాదులో ఒక మాల్ ఏర్పాటుచేసింది. నిజానికి ప్రపంచంలో ఉండే అన్ని లులూ మాల్స్ లోకి ఇదే అతి చిన్నమాల్ అనికూడా అంటూ ఉంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. మళ్లీ ఏపీలో వారి ముద్ర గల అతిపెద్ద మాల్ ఏర్పాటుకాబోతుండడం విశేషం. అనుకున్నట్టుగా మూడేళ్ల వ్యవధిలోగా కార్యకలాపాలు మొదలయ్యేలా వారు పనులు మొదలుపెడితే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles