తనకు ప్రజలు ఒక్క చాన్స్ ఇచ్చినందుకు గాను జగన్మోహన్ రెడ్డి ఎలాంటి విధ్వంసక పరిపాలనను రాష్ట్రానికి రుచిచూపించారో అందరికీ తెలుసు. కేవలం విధ్వంసం మాత్రమే కాదు.. అత్యంత దుర్మార్గమైన పాలనను కూడా అందించారు. ఆయన సర్కారు గద్దెమీదికి రాగానే తీసుకున్న కొన్ని దుర్మార్గ నిర్ణయాల్లో అన్న క్యాంటీన్లను మూసివేయడం కూడా ఒకటి.
పేదవాడి ఆకలి తీర్చడంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లు ఎంతో మంచి పాత్ర పోషించాయి. చిరుద్యోగులు, కూలీలు లాంటి వాళ్లందరికీ ఇవి చాలా ఉపయోగకరం అయ్యాయి. కడుపు నింపాయి. జగన్ వాటిని రద్దు చేయడం అనేది.. పేదోడి కడుపు మీద కొట్టడమే అనే అభిప్రాయం అప్పట్లో సర్వత్రా వ్యక్తమైంది.
మిగిలిన నిర్ణయాలన్నీ ఎలా ఉన్నప్పటికీ… కనీసం పేరు మార్చి, వైఎస్సార్ పేరు పెట్టి అయినా.. 5 రూపాయల క్యాంటీన్లనున కొనసాగించాలని తటస్తులు, మేధావులు పలువురు సూచించినా జగన్ తలకెక్కలేదు. పైగా ఆ పథకం చంద్రబాబు సొంత ఆలోచనేం కాదు. పొరుగు రాష్ట్రాలనుంచి కాపీ కొట్టినదే. అయినా దాని మీద చంద్రబాబు ముద్ర ఉంటుదన్నట్టుగా భయపడి కొనసాగించడానికి జగన్ ఇష్టపడలేదు. సొంత పార్టీ వారు చెప్పినా కూడా వినలేదు.
అలాంటి జగన్ దుర్మార్గపు నిర్ణయం నుంచి ప్రజలకు, పేదలకు, అన్నార్తులకు ఇవాళ ఉపశమనం కలిగించారు చంద్రబాబునాయుడు.
అధికారంలోకి వచ్చినతొలినాడు సంతకాలు చేసిన విధంగానే ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించారు చంద్రబాబు. పేదవాడి కడుపు నింపే కార్యాచరణను అమల్లోకి తెచ్చారు. రాష్ట్రంలో మొత్తం వంద క్యాంటీన్లు మొదలయ్యాయి. ఈ పథకం శాశ్వతంగా కొనసాగాలనే అభిలాషను చంద్రబాబు ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.
అయితే.. పథకం శాశ్వతంగా కొనసాగాలనుకోవడం వరకు బాగానే ఉంది. అయితే దీనికి ప్రత్యేకంగా ఒక విధివిధానాలు రూపొందించి.. చట్టంచేసేస్తే ఇక ప్రభుత్వాలు మారినా సరే పథకం ఆగకుండా ఉంటుందని పలువురు సూచిస్తున్నారు. చంద్రబాబు ఆ పనిచేస్తే బాగుంటుందని అంటున్నారు.