చంద్రబాబు నాయుడు పార్లమెంటు సమావేశాలకు తమ పార్టీ ఎంపీలను సన్నద్ధం చేసే దిశగా నిర్వహించిన సమావేశంలో కొన్ని కీలక సూచనలు చేశారు. పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ ప్రతినెలా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలని ఆయన సూచించారు. మంత్రులకు, ఎంపీలకు ఎంత ముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ.. వాటిని సర్దుకుని విధిగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్దేశించారు. ఇలాంటి సూచన పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులలో అసూయ మొదలవుతోంది. చంద్రబాబు నాయుడు ఇవాళ చేస్తున్న తరహాలో ఆ రోజుల్లో గనుక జగన్మోహన్ రెడ్డి తమకు అవకాశం ఇచ్చి ఉంటే ఇవాళ ఓడిపోయే వాళ్ళం కాదని వారు అంటున్నారు.
జగన్ తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత పింఛన్ల పంపిణీ వంటి సంక్షేమ పథకాల అమలుకు వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. పింఛన్లు కాకుండా ఇతర సంక్షేమ పథకాల కోసం తాను బటన్ నొక్కితే, నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు డబ్బులు వేసేసే విధానాన్ని తీసుకువచ్చారు. ఈ పద్ధతి వలన రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్న అందరికీ కూడా ముందు జగన్- తర్వాత వాలంటీర్లు మాత్రమే కనిపిస్తూ వచ్చారు. మధ్యలో ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గాని, స్థానిక నాయకులు గానీ ఎవరూ లేరు! వారికి అసలు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. క్రమంగా ప్రజల దృష్టిలో వారికి విలువ లేకుండా పోయింది. అలాంటి పరిణామాల వల్లనే ఎన్నికలు వచ్చినప్పుడు ఇంటింటికి తిరిగి ఓట్లు వేయమని అడిగే చనువు కూడా స్థానిక నాయకులకు లేకుండా పోయిందనేది పార్టీ శ్రేణుల ఆవేదన.
నిజానికి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు ఒకటి రెండు సంవత్సరాల ముందు నుంచి పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు ఇలాంటి పోకడల పర్యవసానం గురించి తెలియజేసే ప్రయత్నం చేశారు. అయితే ఎవరు చెప్పినా వినిపించుకునే అలవాటు లేని జగన్ సహజంగానే పట్టించుకోలేదు. తాను గడపగడపకు వైసిపి అనే కార్యక్రమాన్ని డిజైన్ చేసి ఆప్రకారం ఎమ్మెల్యేలందరూ వెళ్లాలని బెత్తం పట్టుకుని అదిలించారు. తద్వారా ఎమ్మెల్యేలను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లాగా ఇంటింటికి తిప్పారు. వారు ప్రతి ఇంటికి ప్రభుత్వం ఎంత లబ్ధి చేకూర్చుందో ఒక లేఖను వారికి అందించి, మా జగనన్నే మీకు ఇచ్చాడు.. మీరు మళ్ళీ జగనన్నకే ఓటు వేయాలి అని మార్కెటింగ్ చేసుకుంటూ గడిపారు. ప్రజల దృష్టిలో ఎమ్మెల్యేలకు స్థానిక నాయకులకు విలువ లేకుండా పోయింది. దాని ఫలితమే ఎన్నికల సమయంలో వారు వెళ్లి ప్రజలను అడగడానికి కూడా లేకుండా పోయింది.
జగన్ చేసిన తప్పులు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తొలి దశలోనే సరిదిద్దారు. ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితులలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో విధిగా పాల్గొని తీరాల్సిందే అని ఆయన అంటున్నారు. అలాగే మంత్రులు, ఎంపీలు అందరూ వారంలో కనీసం ఒక్కరోజు పార్టీ ఆఫీసుకి వెళ్లాలని కార్యకర్తల ఇబ్బందులు తెలుసుకోవాలని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించాలని కూడా ఆయన ఆదేశించారు. ఇలాంటి జాగ్రత్తలు ఏవీ తీసుకోకుండా జగన్ అప్పట్లో తాను తలచిందే రాజబాట అన్నట్టుగా ఒంటెత్తు పోకడలు పోవడం వల్ల పార్టీ సమూలంగా సర్వనాశనమైందని ఇవాళ ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎంపీలు కుమిలిపోతున్నారు. చంద్రబాబు నాయకత్వ పటిమను చూసి అసూయ పడుతున్నారు.