చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన కాలంలో జరిగిన లోపాల మీద విమర్శలు చేయడానికి సమయం వెచ్చిస్తున్నారని ఎవరైనా నిందించవచ్చుగాక! ఐదేళ్లపాటు పరిపాలన పూర్తిగా గాడిదప్పిపోయినప్పుడు అలా జరగడం తప్పదు. కానీ కాస్త లోతుగా గమనిస్తే.. జగన్ మోహన్ రెడ్డి తన పరిపాలన కాలంలో రాష్ట్ర అభివృద్ధిని ఏ రకంగా అయితే విస్మరించి ప్రజలను కష్టాలపాలు చేశారో.. ఆ లోపాలను సరిదిద్దడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు పూనిక వహించినట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా గ్రామ స్వరాజ్యం ఆవిష్కరణకు చంద్రబాబు చిత్తశుద్ధి ఎంతగా ఉన్నదో మనకు స్పష్టమవుతోంది.
జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన కాలంలో గ్రామాల అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టారు. పంచాయతీలకు దక్కవలసిన నిధులను కూడా దారి మళ్లించి ఇతర అవసరాలకు వాడుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి తప్పులు చేయకుండా రుజుమార్గంలో నడుస్తోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీలకు 998 కోట్లు నిధులు వారి ఖాతాల్లో వేశారు. త్వరలో మరో 1100 కోట్లు పంచాయితీల ఖాతాలకు విడుదల చేయబోతున్నట్లుగా చంద్రబాబు చెబుతున్నారు. ఇప్పుడు రాష్ట్రమంతా ఒక పండగలాగా గ్రామసభలు నిర్వహిస్తూ.. ఆయా గ్రామాల అవసరాలు ఏమిటో ఆ సభల్లో నిర్ణయించే వాతావరణం నడుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు హామీలు ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్న ఈ ఐదేళ్లలో గ్రామాల రూపురేఖలు మారబోతున్నాయని ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రమంతటా 17,500 కిలోమీటర్ల సిసి రోడ్లను నిర్మిస్తామని, పదివేల కిలోమీటర్ల డ్రైన్లు నిర్మిస్తామని, 2500 కిలోమీటర్ల బిటి రహదారులు నిర్మిస్తామని చంద్రబాబు నాయుడు గ్రామ సభలో హామీ ఇచ్చారు. నిజంగా ఐదేళ్లలో ఈ పనులన్నీ పూర్తయితే గనుక గ్రామాల రూపురేఖలు మారడం మాత్రమే కాదు… గ్రామీణ ప్రజలు కూటమి పార్టీలను నెత్తిన పెట్టుకొని పూజిస్తారని చెప్పవచ్చు.
సాధారణంగా ఓడిపోయిన పార్టీ వారు తమ ఓటమికి దారి తీసిన కారణాలను తెలుసుకొని.. వాటిని దిద్దడానికి ప్రయత్నించాలి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రోడ్లు సర్వనాశనమైనా మరమ్మతుల గురించి కూడా పట్టించుకోలేదు. కొత్త రోడ్ల సంగతి సరేసరి. గ్రామాల పురోగతిని వాటి ఖర్మకు వదిలేశారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన తప్పులను ఆయన గుర్తించారో లేదో తెలియదు గాని.. బాబు నాయుడు మాత్రం చాలా బాగా గుర్తించారు. జగన్ కు ఎదురైన పరిస్థితి తనకు వాటిల్లకూడదనే ముందు జాగ్రత్తతో.. గ్రామాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి ఇలా పని చేస్తూ పోతే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని ఆదరించకుండా, నీరాజనం పట్టకుండా ఎలా ఉంటారు?