బాలయ్య ఎంట్రీ ఇస్తే ఇంకో రేంజ్ దబిడిదిబిడే!

Wednesday, January 22, 2025

ఒకవైపు వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న ‘మేమంతా సిద్ధం’ ప్రచార సభలు.. ఒకే వ్యక్తి మీద ఆధారపడి జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించదగిన మరో నాయకుడు లేరా అంటే.. లేరని కాదు. కానీ.. జగన్ కు  ఇష్టం ఉండదు. పార్టీలో రెండో అధికార కేంద్రం ఉండడాన్ని ఆయన ఇష్టపడరు. అంతా తన ఒక్కడి చేతులమీదుగానే నడవాలనే అహంకారం ఆయన సొంతం. ఆ పార్టీ అలా ఉండగా.. విపక్షాల వైపు నుంచి మాత్రం.. రాష్ట్రవ్యాప్తం ప్రచారంలో అనేక మంది ఉన్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా రాష్ట్రవ్యాప్త ప్రచారానికి బస్సుయాత్ర తో సిద్ధం కావడం.. తెలుగుదేశం శ్రేణులకు అదనపు ఉత్సాహం అందిస్తోంది. బాలయ్య ప్రచారంలోకి ఎంట్రీ ఇస్తే.. ఇక తమ ప్రత్యర్థులకు దబిడిదిబిడే అని వారు ఆనందిస్తున్నారు.

ఇప్పటికే విపక్ష కూటమి తరఫున రాష్ట్రవ్యాప్త ప్రచారాలు బాగానే జరుగుతున్నాయి. ప్రజాగళం పేరుతో చంద్రబాబు సుడిగాలి పర్యటనలు చేస్తుండగా, పవన్ కల్యాణ్ వారాహి యాత్ర కూడా ముమ్మరంగా సాగుతోంది. మరోవైపు నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో యాత్ర కొనసాగిస్తున్నారు. రాక్షసపాలన పోవాలంటూ ఆమె కూడా నిప్పులు చెరుగుతున్నారు. బిజెపి రాష్ట్ర సారథిగా పురందేశ్వరి కూడా జగన్ ప్రభుత్వపు అరాచకాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. ఒకే కూటమికి చెందిన వీరందరూ ఒక ఎత్తుకాగా జగన్ చెల్లెలు చేస్తున్న విమర్శలు ఇంకో ఎత్తు. కేవలం వివేకా హత్య ఒక్కటే ఎజెండాగా ఆమె జగన్ ను, అవినాష్ ను ఓ ఆటాడుకుంటున్నారు. ఇందరి విమర్శల దాడుల మధ్య జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంటే.. ఇప్పుడు నందమూరి బాలయ్య జత కలవడం కూటమికి అదనపు ఎడ్వాంటేజీగా మారబోతోంది.

హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ శనివారం నుంచి బస్సుయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్త  ప్రచారానికి దిగుతున్నారు. ఆయన సభలకు ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ అని పేరు పెట్టారు. ఎన్డీయే కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో బాలయ్య విస్తృతంగా పర్యటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హిందూపురం ఎమ్మెల్యే కూడా అయిన ఆయన అక్కడ ఈనెల 19న నామినేషన్ వేయబోతున్నారు.

ప్రచార పర్వంలోకి బాలకృష్ణ అడుగుపెడితే.. ఇంకో రేంజిలో సాగిపోతుందని అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. యాత్రకు సిద్ధమైన బస్సు మీద కూడా ‘బాలయ్య unstoppable’ అంటూ రాయించడం విశేషం. రాయలసీమ జిల్లాల ఎన్నికల ప్రచారంలో బాలయ్య ఒక ఊపు తీసుకువస్తారని పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles