అవినీతికి మారుపేరుగా మారిన, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి కూడా జగన్ చేస్తూ వచ్చిన అరాచకాలకు, విచ్చలవిడి దందాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మికి గడ్డురోజులు వచ్చినట్టుగా ఉంది. అయిదేళ్ల జగన్ పాలన కాలంలో.. తెలంగాణ సర్వీసులనుంచి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ సేవలకు వచ్చి.. జగన్ దళంలో కీలక నాయకురాలిగా కీలక విభాగాల్లో చక్రం తిప్పుతూ వచ్చిన వై శ్రీలక్ష్మి, ఆ పీరియడ్ లో ఎలాంటి పాపాలు చేశారు, ఎలాంటి పాపాలకు సహకరించారు, ఎలాంటి నేరాల్లో సంధానకర్తగా ఉన్నారు..అనే విషయాల్లో కూటమి సర్కారు ఇంకా దృష్టి సారించనేలేదు. అయితే.. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పాల్పడిన నేరాలే ఆమెను ఇప్పుడు జైలుకు పంపే పరిస్థితి కనిపిస్తోంది. కాలికేస్తే వేలికి, వేలికేస్తేకాలికి అన్నట్టుగా.. కోర్టుల్లో పిటిషన్లు రివ్యూ పిటిషన్లు రకరకాల మడతపేచీలతో వేస్తే గేమ్ ఆడుతూ వచ్చిన శ్రీలక్ష్మికి తాజాగా హైకోర్టులో వేసిన రివిజన్ పిటిషన్ లో కూడా నిరాశ ఎదురైంది. ఓబుళాపురం మైనింగ్ కేసులో అక్రమాలు జరిగాయనే కేసు నుంచి తనను తప్పించాలంటూ.. ఆమె వేసిన డిశ్చార్జి పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. తన నిజాయితీని సీబీఐ కోర్టులో విచారణ ఎదుర్కోవడం ద్వారా నిరూపించుకోవాలని ఆదేశించింది. సుప్రీం దాకా వెళ్లినప్పటికీ.. హైకోర్టులోనే తేల్చుకోవాలన్న వారి సూచన మేరకు రివిజన్ పిటిషన్ ను హైకోర్టు మళ్లీ విచారించింది. తాజా ఉత్తర్వులు వచ్చాయి.
ఈ ఉత్తర్వుల పర్యవసానంగా.. శ్రీలక్ష్మి మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కేసులో మిగిలిన నిందితులు గాలి జనార్ధనరెడ్డి, బివి శ్రీనివాసరెడ్డి, గనుల శాఖ మాజీ డైరెక్టర్ విడి రాజగోపాల్, గాలి వ్యక్తిగత సహాయకుడు ఆలీఖాన్ లకు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష ఆల్రెడీ విధించిన సంగతి తెలిసిందే. ఈ శిక్ష అమలును హైకోర్టు నిలిపివేసి ఉన్న నేపథ్యంలో వారంతా ప్రస్తుతానికి బయటే ఉన్నారు. మిగిలిన నిందితులందరికీ శిక్షలు కూడా పడిన నేపథ్యంలో.. శ్రీలక్ష్మి పాత్ర గురించి కొత్తగా ఇప్పుడు మరోసారి విచారణ జరపాల్సి ఉంది. సీబీఐ కోర్టులో విచారణ సాగితే.. మిగిలిన నిందితుల మాదిరిగానే శ్రీలక్ష్మి కూడా ఏడేళ్ల శిక్ష పడే అవకాశం ఉన్నదని, వారి తరహాలోనే ఆమె ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లి శిక్ష నిలుపుదల ఉత్తర్వులు తెచ్చుకోవచ్చునని న్యాయనిపుణులు భావిస్తున్నారు. అయితే ఈలోగా శ్రీలక్ష్మి సుప్రీం కోర్టును ఆశ్రయించి.. హైకోర్టు తీర్పును కొట్టివేయాల్సిందిగా..తనను కేసు నుంచి డిశ్చార్జి చేయాల్సిందిగా కోరే అవకాశం ఉంది.
ఓబులాపురం మైనింగ్ కేసు శ్రీలక్ష్మి మెడకు గట్టిగానే చుట్టుకుని ఉంది. ఈ కేసునుంచి బయటపడడానికి ఆమె గతంలో కూడా అనేక ప్రయత్నాలు చేశారు. సీబీఐ కేసును కొట్టేయాలంటే తొలుతే హైకోర్టుకు వెళ్లగా తిరస్కరించారు. గనుల సరిహద్దుల వివాదం సుప్రీంలో తేలేదాకా తన మీద విచారణ జరగరాదని మరో పిటిషన్ వేసినా హైకోర్టు తిరస్కరించింది. తర్వాత తనను కేసునుంచి డిశ్చార్జి చేయాలని సీబీఐ కోర్టును ఆశ్రయించగా వారు కొట్టివేశారు. హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేయగా.. అక్కడ ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే తమ వాదనలు వినకుండానే తీర్పు ఇచ్చారంటూ సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. సీబీఐ వాదనలు కూడా విన్నతర్వాతే తీర్పు ఇవ్వాలని, హైకోర్టు పునర్విచారణ జరపాలని సుప్రీం తేల్చింది. దీంతో తాజాగా జస్టిస్ లక్ష్మణ్ నేతృత్వంలో హైకోర్టు రివిజన్ పిటిషన్ ను విచారించింది. సీబీఐ వాదనలు కూడా విన్న తర్వాత.. శ్రీలక్ష్మి పిటిషన్ ను కొట్టివేస్తూ.. ఆమె సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సిందే అని తేల్చింది. ఆమె ఇక సుప్రీంను ఆశ్రయిస్తే ఏమైనా మలుపులు ఎదురౌతాయేమో చూడాలి.
ఐఏఎస్ శ్రీలక్ష్మి.. సుప్రీం కూడా నో అంటే ఇక జైలే!
Friday, December 5, 2025
