అదానీ సంస్థల నుంచి జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రూ.1750 కోట్లు ముడుపులు తీసుకుని సెకితో విద్యుత్తు ఒప్పందాలు కుదుర్చుకున్న వ్యవహారం నెమ్మది నెమ్మదిగా మరుగున పడుతోంది. ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు ఈ అంశం గురించి మాట్లాడడం తగ్గింది. దానికి తగినట్టే మీడియా ఫోకస్ కూడా తగ్గింది. అయితే.. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ సుదీర్ఘ పరిశోధన చేసి.. జగన్ హయాంలో ప్రభుత్వంలోని దాదాపుగా అన్ని శాఖలూ వద్దు వద్దని వారించినా కూడా జగన్ వినకుండా.. అందరి సలహాలు పక్కన పెట్టి.. సెకితో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టుగా, ఇది ఖచ్చితంగా లోపాయికారీ డీల్ అన్నట్టుగా ఒక కథనం అందించింది.
ఈ వ్యవహారాలు ఒక పక్కనుండగా.. అదానీ ముడుపుల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిని మరోసారి జైలుకు పంపేదాకా ఆయన చెల్లెలు షర్మిల విశ్రమించేలా కనిపించడం లేదు. లంచాలు తీసుకుని జగన్ రాష్ట్రం పరువు తీశారంటూ ఆమె తాజాగా మరోసారి విరుచుకుపడుతున్నారు. జగన్ జనం నెత్తిన లక్షన్నర కోట్ల రూపాయల భారం వేశారని, జగన్ తీసుకున్న ముడుపుల వ్యవహారానికి సంబంధించి తక్షణం ఏసీబీ విచారణకు ఆదేశించాలని ఆమె చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
షర్మిల కాంగ్రెసు నాయకురాలు గనుక.. మోడీని కూడా ఇరుకున పెట్టేలా మాట్లాడ్డానికి ఉత్సాహపడుతుంటారు. అదే క్రమంలో.. అదానీ ముడుపుల వ్యవహారంపై కూడా ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని ఆమె కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆ రకంగా రాహుల్ డిమాండ్ నే పునరుద్గాటించారు. ఇటు రాష్ట్ర వ్యవహారాల్లో జగన్ మీద ఏసీబీ కేసు పెట్టి విచారించాలంటూ ఆమె గట్టిగానే కోరుతున్నారు.
నిజానికి ఇప్పటికే జగన్ మీద ఈ విషయంలో ఒక ఏసీబీ కేసు నమోదు అయింది. అయితే అప్పట్లో ఒప్పందాలు చేసుకునే క్రమంలో జరిగిన సమస్త లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను పకడ్బందీగా సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి చాపకింద నీరులు చాలా వర్క్ జరుగుతోందని, అన్ని ఆధారాలు చిక్కిన తర్వాత.. ఇక అన్నివైపుల నుంచి ముట్టడించి.. జగన్ ను విచారిస్తారని తెలుస్తోంది.
అన్నయ్యను జైలుకు పంపేదాకా చెల్లెమ్మ వదిలేలా లేదే!
Wednesday, January 22, 2025