‘ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప, తాను ఎంత సేపు మాట్లాడదలచుకుంటే అంత సమయమూ ఇస్తే తప్ప.. తాను శాసనసభలో అడుగుపెట్టనని మీ నాయకుడు మంకుపట్టు పట్టి ఇంట్లో కూర్చుంటున్నారు సరే.. తమరు ఎందుకు సభకు వెళ్లడం లేదు సార్’ అని అడిగితే వారి వద్ద సమాధానం ఉండదు. మిమ్మల్ని మీ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే.. ఆ నియోజకవర్గం కోసం మీరేం చేశారు. కనీసం ఆ నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం కూడా చేయకుండా బయట కూర్చుని మీరేం చేస్తున్నట్టు? అని అడిగితే.. వారు నిరుత్తరులౌతారు. ఆయనంటే పంతానికి పోయారు గానీ.. తమ నాయకుడు తమరిని శాసనసభకు వెళ్లవద్దని చెప్పనేలేదంట కదా.. మరి తామంతా ఎందుకు ఆబ్సెంటవుతున్నారు.. అని ప్రశ్నిస్తే గనుక.. వారు తెల్లమొహం వేస్తారు. ఈ రకంగా తమ లోపాల గురించి ఒక్క మాట కూడా చెప్పలేని వాళ్లు ఏకంగా చంద్రబాబునాయుడు రాజీనామా చేసి, ప్రభుత్వాన్ని రద్దు చేసి.. శాసనసభ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కామెడీ మాటలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నుంచి వస్తున్నాయి.
జగన్ ను మినహాయిస్తే.. ఆ పార్టీకి ఉన్న పది మంది ఎమ్మెల్యేల్లో అంతో ఇంతో మీడియాలో అప్పుడప్పుడూ కనిపించి మాట్లాడే ఏకైక ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాత్రమే. ఆ రకంగా తాను ఎమ్మెల్యేననే విషయాన్ని ప్రజలకు గుర్తు చేస్తుండడానికి ఆయన తాపత్రయపడుతూ ఉంటారు. తాజాగా ఆయన మీడియా ముందుకు వచ్చి.. చంద్రబాబునాయుడు అవినీతి గురించి, అప్పుల గురించి.. రకరకాల విమర్శలు చేశారు. అవన్నీ.. ఆ పార్టీ నాయకులందరూ గత పదిహేను నెలలుగా చేస్తూనే వస్తున్న పాతచింతకాయపచ్చడి విమర్శలే కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే.. తాటిపర్తి చంద్రశేఖర్ కాస్త శృతిమించి.. చంద్రబాబునాయుడు రాజీనామాను డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తే.. అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది కూడా ప్రజల కోసం త్యాగాలు చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతారట. కూటమి ప్రభుత్వ పాలన మీద రెఫరెండంలాగా ప్రజల తీర్పును తాజాగా కోరుతారట. అప్పుడు ఎవరికి ప్రజాబలం ఉన్నదో తేల్చుకుందాం అంటున్నారు.
అయినా ప్రభుత్వాన్ని సీఎం రద్దుచేస్తే.. ఇక వారి త్యాగాలతో పనేముంది. వారి పదవులు కూడా పోతాయి కదా.. అనేది ఒక వాదన. అయితే.. ప్రజల్లో తమ బలంపెరిగిందని చాటుకోవాలంటే.. వారే రాజీనామాలు చేసి.. ఆ 11 స్థానాలకు ఉప ఎన్నికలు తెప్పించుకుని.. నెగ్గి నిరూపించుకోవచ్చు కదా.. చంద్రబాబు రాజీనామా కోరడం ఎందుకు? అనేది మరో వాదన. జగన్మోహన్ రెడ్డి కళ్లలో ఆనందం చూసే క్రమంలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కూడా తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారని అనిపిస్తోంది.
సభకు వెళ్లే దమ్ములేదు.. ఎన్నికలు కావాలంట?
Thursday, December 4, 2025
