అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనప్రాయమైన ఒక పని మాత్రం తప్పకుండా చేస్తుంటారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పిలిపించి.. వారితో ఒక సమావేశం పెడతారు. సాధారణంగా ప్రతి పార్టీ కూడా చేసే పనే ఇది. శాసనసభ సమావేశాలు మొదలవుతున్నప్పుడు.. సభలో తాము అనుసరించాల్సిన వ్యూహాలు ఎలా ఉండాలో.. పోరాటం ఎలా సాగాలో.. ఏ అంశాలపై సభలో మాట్లాడాలో, విధాననిర్ణయాలు ఏమిటో చర్చించుకోవడానికి ఇలాంటి సమావేశాలు జరుగుతాయి. అయితే ఇవన్నీ కూడా సభకు హాజరయ్యే వారికి గానీ.. ఇంట్లో కూర్చుని, సభ పోచికోలు కబుర్లు మాట్లాడేవాళ్లకు ఎందుకు అని జనం ఇప్పుడు అనుకుంటున్నారు.
ఎందుకంటే.. గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతుండగా.. అదే రోజున జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తాడేపల్లిలోని ప్యాలెస్ లో ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సన్నాహక సమావేశం అనేది అసెంబ్లీకి వెళ్లేవారికి అవసంర గానీ.. తమకెందుకు సార్ అని సోషల్ మీడియాలో జగన్ ను ట్రోల్ చేస్తున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టడానికి అవమానం ఫీలవుతున్నారు. అందుకని.. అసలు వెళ్లకుండా తమను గెలిపించిన ప్రజలను అవమానించేలా ప్రవర్తిస్తున్నారు. ప్రజాసమస్యలను ప్రస్తావించడానికైనా ఆయన సభకు రావాలి కదా అనే డిమాండ్లు సర్వత్రా వినిపిస్తూనే ఉన్నాయి. అసెంబ్లీ సభ్యత్వమే రద్దయిపోతుందని భయమేసిన ఒక్క సందర్భంలో మాత్రం సభకు వచ్చి అటెండెన్సు వేసి, కొద్దిసేపు గడిపి వెళ్లిపోయిన జగన్ దళం.. ప్రతిసారీ డుమ్మా కొడుతూ.. ప్రజాస్వామిక విలువలకు భిన్నంగా వ్యవహరిస్తూ వస్తోంది.
తనకు ప్రధాన ప్రతిపక్ష నేతగా కేబినెట్ సమాన హోదా ఇవ్వలేదని, అది ఇచ్చేదాకా సభలో అడుగుపెట్టనని జగన్ మొండిపట్టుదలతో ఉన్నారు. కనీసం పది శాతం సీట్లు దక్కిన పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది సాంప్రదాయం అని.. ప్రజలే జగన్ కు ఆ హోదా తిరస్కరించిన తర్వాత.. తాము చేయగలిగేది ఏం ఉంటుందని.. పాలకపక్షం అంటోంది. జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి తాను చెబుతున్న సమస్యల గురించి, ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రస్తావించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా సవాళ్లు విసిరారు. కూటమిలోని ప్రతి మంత్రి కూడా జగన్ కు ధైర్యముంటే శాసనసభకు రావాలని, కనీసం తమను గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యలనైనా ప్రస్తావించాలని అంటూనే ఉన్నారు. కానీ.. జగన్ లో ఎలాంటి చలనం లేదు. సభకు వెళ్లే ధైర్యం లేదుగానీ.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇలాంటి మొక్కుబడి పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించుకోవడంలో అర్థమేమిటని ప్రజలు నిలదీస్తున్నారు.
అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేదు గానీ.. ఎందుకిదంతా?
Tuesday, December 30, 2025
