మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఒక పంచ్ డైలాగు వేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఆరునెలల సమయం ఇద్దామని అనుకున్నానని చెప్పారు. (ఆయన అనుకున్న సంగతి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు, ఆయన వెల్లడించలేదు.) కానీ ఇప్పటికే ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని చూస్తోంటే, ప్రభుత్వ వైఫల్యాలను చూస్తోంటే ఇక ఆగక్కర్లేదని అనిపిస్తోందని జగన్ చెప్పారు. ఇక స్ట్రెయిట్ గా ప్రజల పోరాటాల్లోకి వచ్చేస్తానని అన్నారు. (ఆ మాట అనేసి, రెండోరోజున ఆయన బెంగుళూరు యలహంక ప్యాలెస్ కు పారిపోయారు.. అది వేరే సంగతి) కానీ ప్రస్తుత పరిస్థితులను గమనిస్తోంటే.. ‘ఆగక్కర్లేదు’ అనే డైలాగు జగన్ కు పనిచేస్తుందా? పవన్ కల్యాణ్ కు పనిచేస్తుందా? అని సందేహం కలుగుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన అనేక మంది నాయకులు ఇప్పుడు జనసేనలో చేరడానికి క్యూ కడుతున్నారు. జగన్ సొంత మామయ్య.. ఒకప్పట్లో పార్టీకి జగన్ కు కూడా పెద్దదిక్కుగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి, పవన్ కల్యాణ్ ను కలిసి జనసేనలో చేరడానికి ముహూర్తం ప్రకటించిన తర్వాత ఈ ఊపు మొదలైంది. ఆ పిమ్మటే మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయబాను కూడా పవన్ ను కలిసి చేరబోతున్నట్టు ప్రకటించారు. చాలా కాలం కిందటే వైసీపీకి రాజీనామా చేసిన మారో తాజా మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య కూడా పవన్ కల్యాణ్ ను కలిసి తాను అనుచరులతో కలిసి జనసేనలో చేరబోతున్నట్టు వెల్లడించారు.
ఈ వాతావరణం చూస్తున్నప్పుడు.. ‘ఇక ఆగక్కర్లేదు’ అని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్టుగా.. ఈ డైలాగు ఆయన స్క్రిప్టులో రాసినదిగా అనిపిస్తోంది. ఎందుకంటే.. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి ఇన్నాళ్లుగా చాలా మంది నాయకులు వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేనలో చేరడానికి బేరసారాలు, మంతనాలు సాగిస్తూనే ఉన్నారు. కానీ జనసేన ఇప్పటిదాకా అందరినీ ఆపి ఉంచినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు వంద రోజుల పరిపాలన కూడా పూర్తయిన తర్వాత.. ఇప్పుడు ఒక్కసారిగా- ఇక ఆగక్కర్లేదు అని పవన్ డిసైడైనట్టుగా వెల్లువలా నేతలు వచ్చి చేరుతున్నారు.
వైసీపీ నుంచి ఇంకా కొందరు కొత్తగా రాజీనామా చేసేవారు.. ఆల్రెడీ రాజీనామాలు చేసేసి ఖాళీగా ఉన్నవారు కూడా.. త్వరలోనే వచ్చి జనసేనలో చేరబోతున్నారనే సంకేతాలు వినిపిస్తున్నాయి.