మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రజల్లో తిరుగుతున్నప్పుడు వారిని పలకరించే, వారితో వ్యవహరించే తీరు చాలా తమాషాగా ఉంటుంది. ఆయన పెదవులు విడివడని ఒక కృతకమైన నవ్వు నవ్వుతారు. ఆడామగా తేడా లేకుండా, పిల్లలు వృద్ధులు అనే వ్యత్యాసం చూపించకుండా దగ్గరికి తీసుకుని తల నిమురుతారు. ఆడవాళ్లందరికీ తలమీద ముద్దులు పెడతారు. ఇలా తన ముద్రగల పలకరింపులను ఆయన కొనసాగిస్తారు. ఎక్కడ జనం కనిపిస్తే అక్కడ వారికి కృతకమైన తన ముద్రగల చిరునవ్వుతో చేయి ఊపుతూ అభివాదం చేస్తుంటారు. నిజానికి తాను తిరిగే ప్రాంతాల్లో ఎదురుగా జనం లేకపోయినా కూడా.. మీడియా కెమెరాలు ఖచ్చితంగా ఉంటాయి గనుక.. ఆయన అలాగే అభివాదం చేస్తూ ఉంటారని కూడా అంటుంటారు. అలాగే ఆయనకు సందర్భ శుద్ధి ఉండదు. సంతాపం ప్రకటించే సందర్భాల్లో కూడా ఆయన మొహం మీద అదే కృతకమైన చిరునవ్వు ఉంటుంది. అలాంటి నేత జగన్.. అయిదేళ్లపాటూ తన జనానికి చేతులు ఊపే పిచ్చిన ఎలా దాచుకోగలిగారా? అనే అనుమానం ఇప్పుడు ప్రజల్లో కలుగుతోంది.
ఎందుకంటే.. నవాబుపేట ఘర్షణల్లో గాయపడిన వారిని పరామర్శించడానికి జగన్ తన బెంగుళూరు ప్యాలెస్ నుంచి తరలి వచ్చారు. అలాగే నంద్యాలలో హత్యకు గురైన సుబ్బరాయుడు కుటుంబ పరామర్శకు కూడా వెళ్తానని ప్రకటించారు. కాగా గన్నవరం విమానాశ్రయం నుంచి జగన్ గాయపడిన వారిని పరామర్శించడానికి వెళ్లడం అనేది ఒక విజయయాత్రలాగా సాగడం విశేషం.
జగన్ వస్తున్నారంటే చాలు.. ఆ రోడ్డమ్మట ఉండే గ్రామాలకు, పట్టణాలకు చెందిన వైసీపీ నాయకులకు చుక్కలు కనిపిస్తున్నాయి. జగన్ రోడ్డు మీద ప్రయాణించే సమయంలో.. రోడ్డుకు ఇరువైపులా నిల్చుని ఆయనకు చేతులు ఊపడానికి జనాన్ని పోగేయాలని పార్టీ ఆదేశాలు ఇస్తోంది. ఎన్నికల సమయంలోలాగా ఇలాంటి డ్రామా నడిపిస్తున్నారు. రోడ్డు పక్కన జనాన్ని చూడగానే.. తాను పరామర్శకు వెళుతున్నాననే సంగతి మర్చిపోయి జగన్ కారు దిగి వారికి అభివాదాలు చేసి… డ్రామా రక్తి కట్టిస్తారు.
జనానికి అభివాదాలు చేసే, ముద్దులు పెట్టే పిచ్చి ఇంతగా ఉన్న జగన్.. అయిదేళ్ల పాలన కాలంలో దానిని ఎలా దాచుకున్నారా? అనేది అందరికీ సందేహంగా ఉంది. సీఎంగా ఉండగా.. రోడ్డు మీద తిరిగేప్పుడు ఇరువైపులా బారికేడ్లు కట్టి, పరదాలు కట్టి, చెట్లను కూడా నరికించేసి తిరిగిన జగన్ ఇప్పుడు మాత్రం.. జనాన్ని బలవంతంగా పోగేయించి మరీ చిరునవ్వులు చిందిస్తూ చనిపోయిన వారి, గాయపడిన వారి పరామర్శ యాత్రలకు వెళుతుండడమే తమాషా!
జగన్ ఈ పిచ్చిని అయిదేళ్లు ఎలా దాచుకున్నారో?
Tuesday, November 12, 2024