వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావొచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావొచ్చు.. ఏ వైసీపీ నేత అయినా కావొచ్చు.. ఏ పబ్లిక్ కార్యక్రమం నిర్వహించినా.. వారి ప్రధానమైన కోరిక ఏమిటో తెలుసా? ఆ కార్యక్రమం ద్వారా ప్రజల తరఫున పోరాడడమూ, లేదా ప్రభుత్వం పట్ల తమ నిరసన స్వరాలను వినిపించడమూ మాత్రమే అనుకుంటే పొరబాటు. వారి అసలు లక్ష్యం అది కాదు. కేవలం సంచలనం సృష్టించడమే! రాద్ధాంతం చేయడమే!! ఏదో జరిగిపోతోందనే భయాన్ని ప్రజల్లో పుట్టించడమూ.. తమను ప్రభుత్వం అణచివేస్తున్నదనే అపోహను ప్రజల్లోకి వ్యాప్తి చేయడం మాత్రమే. తాజాగా గోశాల సందర్శనకు వెళ్తానంటూ కొత్త డ్రామా ప్రారంభించిన భూమన కరుణాకర రెడ్డి వ్యవహార సరళిని గమనిస్తే అదే అనిపిస్తోంది.
టీటీడీ గోశాలను కాస్తా గోవధశాలగా మార్చేశారంటూ కరుణాకర రెడ్డి అత్యంత తీవ్రమైన ఆరోపణలు చేశారు. దాని మీద టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా. భూమన ఏ విచారణకైనా తాను సిద్ధమేనని చెప్పిన నేపథ్యంలో ఆయన కోరుకున్నట్టే విచారణ జరుగుతుంది.
ఈలోగా ఈ వ్యవహారాన్ని ఇంకాస్త సంచలనంగా మార్చడానికి భూమన కరుణాకరరెడ్డి మరో కొత్త ఎత్తుగడ వేశారు. గోశాలను సందర్శించడానికి వెళుతున్నట్టు ప్రకటించారు. కూటమి ప్రజాప్రతినిదులు కూడా సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తగు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇరు పక్షాల నాయకులకు కూడా స్పష్టమైన సూచనలు చేశారు. గోశాలను నాయకులు ఎవ్వరైనా సందర్శించవచ్చు గానీ.. గుంపులుగా రావొద్దని, నాయకులు తమ గన్ మెన్ ల వరకు వెంటబెట్టుకుని గోశాల సందర్శనకు రావొచ్చునని ప్రకటించారు. ఈ సూచన ఇరువైపుల వారికీ వర్తిస్తుంది. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు చేసిన సూచన ఇది.
అయితే ఈ సూచనను పాటిస్తే అంతా ప్రశాంతంగానే ఉంటుంది కదా! మరి వైసీపీ నాయకులకు అది ఇష్టం ఉండదు కదా.. శాంతి ర్యాలీ అని పేరు పెట్టి.. శాంతి భగ్నం చేయడమే కదా వారి కోరిక! దానికి తగ్గట్టుగా భూమన కరుణాకర రెడ్డి.. తనతోపాటు ఎంపీ గురుమూర్తిని, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని.. వందల మంది కార్యకర్తలను కూడా వెంటబెట్టుకుని బయల్దేరడానికి సిద్ధమయ్యారు. అయితే ఆయన ఇంటివద్దనే అడ్డుకున్న పోలీసులు.. ర్యాలీగాగానీ, గుంపులుగా గానీ వెళ్లడానికి కుదరదనడంతో భూమన మనుషులు, వైసీపీ కార్యకర్తలు పోలీసుల మీద దురుసుతనం ప్రదర్శించారు.
మొన్న పాపిరెడ్డి పల్లి హెలిప్యాడ్ వద్ద కార్యకర్తలు చేసిన రాద్ధాంతం గానీ, ఇవాళ భూమన చేస్తున్న పని గానీ.. పోలీసుల సూచనలను అతిక్రమించి.. గొడవకు దిగుతున్నట్టుగా చేస్తున్నవే. ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడానికే వైసీపీ నాయకులు ప్రతిచోటా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పోలీసుల సూచన వింటే వాళ్ల కోరిక తీరేదెలా?
Friday, December 5, 2025
