గెలిచినప్పుడు ఒక మాట, ఓడినప్పుడు ఒక మాట మాట్లాడడం రాజకీయ నాయకులకు కొత్త కాదు. ప్రజలు గుర్తిస్తారనే అవమాన భావం కూడా వారికి ఉండదు. ఇప్పుడు వైసీపీ నాయకులు అలాగే చేస్తున్నారు. అమరావతి రాజధాని గురించి కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారు.
అమరావతి ని చంద్రబాబునాయుడు ఒక సామాజిక వర్గం వారికి లబ్ధి చేకూర్చడం కోసం రాజధానిగా ప్రకటించారట. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత విశాల దృక్పథంతో మూడు ప్రాంతాల అభివృద్ధికి మూడు రాజధానులు తెరపైకి తెచ్చారట. ఆ మూడింటిలో అమరావతి కూడా ఒక రాజధాని కదా అని అంటున్నారు.
మాట పరంగా ఇది నిజమే కావొచ్చు. కానీ అసలు అమరావతి ప్రాంతాన్ని అసలు జగన్ సర్కారు ఏనాడైనా రాజధానిలాగా చూసిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్మసానంగా మార్చేసిన ద్రోహం చేసి మళ్ళీ ఇప్పుడు ఈ సన్నాయి నొక్కులు ఏమిటి అని మండిపడుతున్నారు.
రాజధానిగా గుర్తించి ఉంటే కనీసం ఆ ప్రాంతంలో ఒక్క ఇటుక పెట్టి నిర్మాణం అయినా చేశారా అనేది ప్రజల ప్రశ్న.
అమరావతి విషయంలో వైసీపీ ఇంకా ఇలాంటి అబద్ధాలు కొనసాగించినంత కాలం… వారికి భవిష్యత్తు ఉండదని ప్రజలు అంటున్నారు. శాసన రాజధాని అని చెప్పినందుకు కనీసం అసెంబ్లీ నిర్మాణం చేపట్టి ఉండొచ్చు కదా అంటున్నారు. ఆరు వందల కోట్లతో విశాఖలో.. సర్కారు సొమ్ముతో తనకోసం హర్మ్యం నిర్మింప జేసుకున్న జగన్.. అమరావతిలో ఒక్క రూపాయి విలువ చేసే నిర్మాణాలు సాగించారా అనేది ప్రజల ప్రశ్న.
జగన్ 3 రాజధానుల కాన్సెప్ట్ ను ప్రజలు ఛీ కొట్టారని ఎన్నికలు నిరూపించిన తరువాత కూడా.. ఇంకా అదే పనికిరాని మాటలను పట్టుకుని వేళ్ళాడుతూ ఉంటే ఆ పార్టీ ఎప్పటికీ ప్రజల నాడిని గ్రహించలేదు అని ప్రజలు జాలిపడుతున్నారు.