ప్రభుత్వాధికారులు రాజకీయ నాయకుల పట్ల అనుచితమైన అతిభక్తితో వారికి కొమ్ముకాస్తే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తోంది. భక్తి కొలదీ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారి.. వారు ఆడించినట్లెల్లా ఆడితే.. ఆ తర్వాత కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. అంతేకాదు అరెస్టు భయంతో పరారీలో బతకాల్సి వస్తుంది కూడా! జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో ఖనిజాలు గనుక శాఖకు ఎండీ గా ఉంటూ.. నాయకుల వేలకోట్ల స్వాహా పర్వానికి యధేచ్చగా సహకరించిన అధికారి వెంకటరెడ్డి ఉదంతం గమనిస్తే మనకు ఈ విషయమే అర్థమవుతుంది. ఆయన మీద ఏసీబీ విచారణ పర్వం మొదలు కాగా.. ఆయన అసలు తన నివాసాల్లో ఎక్కడ అందుబాటులో లేకుండా పరారయ్యారు.
జగన్ పరిపాలన కాలంలో ఖనిజాలు, గనుల శాఖలోనే వేలాది కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఇసుక దందాలలోనే వైసిపి పెద్దలు 30 వేల కోట్ల రూపాయలకు పైగా స్వాహా చేసినట్టు ఇటీవల మంత్రి గణాంకాలు ప్రకటించారు కూడా. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి కి చెందిన బినామీ సంస్థల పేరుతో దోచుకోవడానికి కీలకంగా ఎండీ వెంకటరెడ్డి సహకరించారు అనేది అభియోగం. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత ముందుగా వెంకటరెడ్డి నీ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా దొరకకుండా.. అప్పటికే ఆయన పరారయ్యారు.
కాగా వైసిపి పాలనలో నాయకులతో అంటకాగిన అనేకమంది అధికారులిప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
లిక్కర్ వ్యాపారంలో వైసిపి దోపిడీకి కీలక సూత్రధారి బెవేరేజేస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి మీద కేసులు నమోదు అయ్యాయి. ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి కూడా ఆల్రెడీ ఒకసారి సస్పెండ్ అయి.. కేసులు ఎదుర్కొంటున్నారు. వారు పోలీస్ విచారణలో నిజాయితీగా జరిగినదంతా ఒప్పుకొని, సూత్రధారులు పేర్లను కూడా వెల్లడిస్తే తప్ప బయటపడలేరు అని నిపుణులు అంచనా వేస్తున్నారు.