నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. జనం మనిషిగా, నిరాడంబరంగా ఉంటూ నిత్యం జనంలో కలిసిపోయే ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఆయన గురించి చాలా మందికి తెలియని సంగతులు కూడా కొన్ని ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత.. ఏపీ సర్కారు కూడా హైదరాబాదునుంచే నడుస్తున్న రోజుల్లో ఎమ్మెల్యేలకు జీతం పెంచారు. అప్పట్లో జగన్ సహా సభ మొత్తం ఆ బిల్లుకు ఆమోదం తెలియజేయగా, కోటంరెడ్డి మాత్రం.. ఎమ్మెల్యేల జీతాలు పెంచాల్సిన అవసరం లేదని, ఈ జీతంతో బతికే పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఎవ్వరూ లేరని ప్రసంగించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే.. ఆయన తనకు ప్రభుత్వం ఇచ్చే జీతాన్ని ప్రతి నెలా.. నియోజకవర్గంలో ఎన్జీవోలకు సేవా కార్యక్రమాల కోసం ఇచ్చేస్తుంటారు. అలాంటి కోటంరెడ్డి తాజాగా తన నియోజకవర్గంలో దాదాపు 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతుండగా.. వాటిని పరిశీలించడానికి టూవీలర్ మీద పర్యటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. పనుల పురోగతిని గమనించడానికి ఆయన ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా సింపుల్ గా.. తనంత తాను బైక్ పై అన్ని ప్రాంతాలు తిరుగుతూ పనులను పరిశీలించారు.
కోటంరెడ్డి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని పలుమార్లు జగన్ ను కలిసి విన్నవించుకున్నారు. అయినా జగన్ పట్టించుకోలేదు. ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి.. జగన్ నిధులు శాంక్షన్ చేసినా కూడా.. రెవెన్యూ అధికారులు విడుదల చేయడం లేదని ఆక్రోశం వెళ్లగక్కారు. తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన చిన్న హామీలను కూడా నెరవేర్చలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పిలిపించి అలా బహిరంగంగా మాట్లాడడం గురించి మందలించారే తప్ప.. నిధులు మాత్రం ఇవ్వలేదు. కేవలం నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోతున్నాననే బాధతోనే ఆయన పార్టీ మారి తెలుగుదేశంలోకి వచ్చారు.
ఇక్కడ ఆయన కోరికలు తీరాయి. నియోజకవర్గం కోసం కూటమి ప్రభుత్వం పుష్కలంగా డబ్బులు ఇచ్చింది. ఒకే రోజున తన నియోజకవర్గ పరిధిలో 105 అభివృద్ధి పనులను ప్రారంభించడం ద్వారా.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక రికార్డు సృష్టించారు. ఆ రికార్డు గురించి ఇంకా ప్రజలు మాట్లాడుకుంటూ ఉండగానే.. ఆయన తన నియోజకవర్గంలో జరుగుతున్న దాదాపు 200 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను పరిశీలించడానికి ఏకంగా బైక్ పై హంగూ ఆర్భాటం లేకుండా పర్యటనలు చేస్తున్నారు. తద్వారా.. జనంతో మమేకమైన ఎమ్మెల్యేగా కోటంరెడ్డి గుర్తింపు తెచ్చుకుంటున్నారని.. ప్రజలతో కలిసి పోవడంలో ఆయన రూటే సెపరేటు అని ప్రజలు అనుకుంటున్నారు.
జనం ఎమ్మెల్యేగా నిలవడంలో ఆయన రూటే సెపరేటు!
Wednesday, March 26, 2025
