వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించిన అయిదేళ్ల కాలంలో ఆయన ఒక్కటంటే ఒక్క పరిశ్రమనైనా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు. పెట్టుబడులను ఆహ్వానించలేకపోయారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అటు చంద్రబాబునాయుడు, ఇటు నారా లోకేష్ ల నిర్విరామ ప్రయత్నాలతో పెద్దపెద్ద సంస్థలు కూడా ఏపీలో తమ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తూ ఉండడం వారికి కంటగింపుగా ఉంది. ఏపీలో పారిశ్రామికంగా, పెట్టుబడులపరంగా, ఉద్యోగావకాశాలపరంగా అభివృద్ధి చెందితే.. తమకు ఇక ఎప్పటికీ రాజకీయ భవిష్యత్తు లేకుండాపోతుందనే భయంతో వారు బతుకుతున్నారు. ఇందులో భాగంగానే.. కూటమి సర్కార్ ప్రయత్నాలతో రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వస్తున్న ఒక్కో సంస్థను ఒక్కో రూపంలో అడ్డుకోవడానికి, బెదరగొట్టి రాష్ట్రంనుంచి తరిమేయడానికి తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి సైంధవ ప్రయత్నాలకు హైకోర్టు వ్యాఖ్యలు చెంపదెబ్బలాగా కనిపిస్తున్నాయి.
విశాఖపట్నం నగరాన్ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుండగా.. ఐటీ కంపెనీలకు భూకేటాయింపులను అభ్యంతరపెడుతూ నమోదైన పిటిషన్లలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ కంపెనీలను ఆకర్షించాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని హైకోర్టు వ్యాఖ్యానించడం విశేషం. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పెట్టుబడులుపెట్టేందుకు ఏ కంపెనీకేూడా ముందుకు రాదని వ్యాఖ్యానించింది. అలా చేయకపోతే ఐటీ కంపెనీల బెంగుళూరు, హైదరాబాద్ లకు తరలిపోయే ప్రమాదం ఉన్నదని కూడా హెచ్చరించింది. రాష్ట్రంలో బడా ఐటీ కంపెనీలు ఏర్పాటు అయితే.. యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, నామమాత్రపు ధరతో చేసే భూకేటాయింపులను చిన్నచూపు చూడకూడదని కోర్టు పేర్కొంది.
కాగ్నిజెంట్ సంస్థకు రూ.99 పైపలకు ఎకరా వంతున 22 ఎకరాలు ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభ్యంతర పెడుతూ వేర్వేరు సంస్థలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశాయి. జడ శ్రావణ్ కుమార్ వీరి తరఫున వాదనలు వినిపించారు. లీజు విధానంలో ఇవ్వాల్సిన భూములను విక్రయిస్తున్నారని ఆయన అన్నారు. అయితే.. ప్రభుత్వ న్యాయవాది మాత్రం.. కూటి సర్కారు తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానానికి అనుకూలంగానే.. ఈ భూ కేటాయింపులు జరుగుతున్నట్టుగా పేర్కొన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గతంలో చంద్రబాబు పాలన ఉన్నప్పటి కాలంనుంచి కూడా.. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారుల పట్ల తమ బినామీలతో కేసులు వేయిస్తూ, వారిని బెదిరిస్తూ లేఖలు రాస్తూ ప్రతిదీ అడ్డుకోవాలని ప్రయత్నిస్తూ వస్తున్న సంగతి ప్రజలకు తెలుసు. అదే దుర్బుద్ధులను ఇప్పుడు కూడా ప్రదర్శిస్తున్నారు. పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తూ వందల మెయిల్స్ పంపుతున్నారని చంద్రబాబు ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన సంగతి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే హైకోర్టు మాత్రం చాలా స్పష్టంగా.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థించడం, ఈ సైంధవుల ఆగడాలకు చెంపదెబ్బలాంటి వ్యాఖ్యలు చేయడం విశేషం.
