క్వాష్ ద్వారా వైసీపీ నేతల ఓవరాక్షన్‌కు హైకోర్టు బ్రేకులు!

Wednesday, April 9, 2025

ఏదో ఒక నేరం చేయడం.. కేసుల్లో ఇరుక్కోవడం.. ఆ కేసును కొట్టేయాలంటూ కోర్టును క్వాష్ పిటిషన్ ద్వారా ఆశ్రయించడం.. ఆ కేసులో తమ మీద చర్యలు తీసుకోకుండా ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేయడం.. ఒకవేళ సానుకూల స్పందన వస్తే ప్రభుత్వం మీద విజయం సాధించినట్లుగా విర్రవీగడం.. ఇదంతా వైసిపి నాయకులకు ఒక అలవాటుగా మారిపోయింది. తాజాగా ఇలాంటి దుర్మార్గమైన పోకడకు హైకోర్టు బ్రేకులు వేసింది. తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు అధికారులను కూడా కలగలిపి దుందుడుకు వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఆయన పిటిషన్ లో విజ్ఞప్తిని తిరస్కరించడం ద్వారా హైకోర్టు సున్నితమైన హెచ్చరిక జారీ చేసినట్లు అయింది.
తెలుగుదేశం నాయకులను విడిచిపెట్టేది లేదని పోలీసుల పాపాలే వారికి శాపాలుగా మారుతాయని వ్యాఖ్యలు చేయడం ద్వారా కాకాని గోవర్ధన్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. తెలుగుదేశం నాయకులు ఒంటేరు  ప్రసన్నకుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కావలిలో ఈ వ్యవహారంపై కేసు నమోదు అయింది. అలాగే వెంకటాచలం సిఐ సుబ్బారావు పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరొక కేసు కూడా ఆయన మీద నమోదు అయింది.

ఈ కేసులు కొట్టేయాలంటూ కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అది ఎప్పటికి తేలుతుందో ఆయనకు కూడా తెలియదు. నిజానికి క్వాష్ పిటిషన్ ద్వారా ఆయన ఆశించిన ప్రయోజనం వేరు. ఈ రెండు కేసులలోనూ తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కాకాని హైకోర్టును కోరారు. అయితే ఈ అభ్యర్థనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. అంతగా అరెస్టు చేస్తారనే భయం ఉంటే గనుక విడిగా ముందస్తు బెయిలు పిటిషన్ వేసుకోవాలని సూచించింది.
తద్వారా- అసలు కేసులో బలం లేదని, నిజం లేదని, కేసును కొట్టేయాలని క్వాష్ పిటిషన్ ద్వారా హైకోర్టు తలుపు తట్టడం.. అక్కడ రకరకాల అడ్డగోలు వాదనలు వినిపిస్తూ.. తమ మీద అరెస్టు వంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు పొందడం అనే కపట ఉపాయాన్ని ఎంచుకునే నాయకులకు హైకోర్టు బుద్ధి చెప్పినట్లుగా అయింది. మరి కాకాని అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తారో చూడాలి!

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles