ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అసెంబ్లీకి కూడా హాజరుకాకుండా నియోజకవర్గ ప్రజల పట్ల అంకిత భావంతో ఆయన రెండు రోజులుగా అక్కడి ప్రజలతో ప్రజాదర్బార్ లు నిర్వహిస్తున్నారు. తన చేతిలో అధికారం ఉన్నప్పుడు.. వారి కష్టాలు ఏమిటో వినలేదు గానీ.. ఇప్పుడు తన చేతిలో అసలేమీ లేనప్పుడు.. జనాన్ని పోగేసి.. వారి వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు. పులివెందులలో రెండురోజులుగా ఇదే తంతు నడుస్తోంది.
ఈ క్రమంలో పులివెందుల నియోజకవర్గం పరిధిలోని జగన్ బాధితులు కూడా ఆయనను వచ్చి కలుస్తున్నారు. పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజన్సీ (పాడా) పేరుతో జగన్ ఓ సంస్థను ఏర్పాటుచేసి పనులు చేయించారు. దీనికింద నియోజకవర్గంలోని తన అనుచరులకు విచ్చలవిడిగా కాంట్రాక్టు పనులు ఇచ్చేశారు. పులివెందులకు అవసరం ఉన్నవీ లేనివీ అన్నీ కాంట్రాక్టుల రూపంలో వారికి అప్పగించారు. వారిలో చాలా మంది పనులు చేశారే గానీ వారికి బిల్లులు రాలేదు. జగన్ ప్రభుత్వ పదవీకాలం ముగిసే సమయంలో కూడా.. పాత తేదీలతో బిల్లులు అప్రూవ్ చేసి వందల వేల కోట్లరూపాయలు చెల్లింపులు చేసేసిన దందాలు నడిపించారు గానీ.. ఈ నియోజకవర్గంలోని తమ్ముళ్లు జగన్ కు గుర్తురాలేదు. ఇప్పుడు తెలుగుదేశం హయాంలో తమ బిల్లులు వస్తాయా అంటూ వారంతా జగన్ వద్దకొచ్చి గొల్లుమంటున్నారు.
అయితే వారికి జగన్ చెబుతున్న సలహా గమనిస్తే నవ్వొస్తుంది. బిల్లులు చెల్లించకపోతే కోర్టుకు వెళ్లి అయినా సరే.. బిల్లులు తెచ్చుకుందాం అంటూ జగన్ చెబుతున్నారట. 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటిదాకా బిల్లుల చెల్లింపు జరగలేదు. జగన్ సర్కారు అయిదేళ్లూ వారి గోడును పట్టించుకోలేదు. వారంతా కోర్టుల్లో వేసిన కేసులు ఇంకా మూలుగుతూనే ఉన్నాయి. తన పాలనలో పాత కాంట్రాక్టర్లు కోర్టుకు వెళితే అస్సలు పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు తన పార్టీ తొత్తులకు మాత్రం.. కోర్టుకు వెళ్లి బిల్లులు తెచ్చుకుందాం అని భరోసా ఇవ్వడం కామెడీగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
అరె..! జగన్ భలే సలహా చెప్పారే!
Thursday, November 21, 2024