లండన్ నుంచి తిరిగి వచ్చే తర్వాత జగన్మోహన్ రెడ్డి తనకు ఇష్టమైన విలేకరులను మాత్రం పిలిపించుకుని తాడేపల్లి ప్యాలెస్ లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. జగన్ విదేశాలకు వెళ్లి వచ్చేలోగా రాష్ట్ర రాజకీయాలలో అనేక మార్పులు జరిగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అనేక రకమైన గత ప్రభుత్వపు అవినీతి బాగోతాలు, వాస్తవాలు వెలుగులోకి వచ్చిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. వాటన్నింటికీ తన జవాబు ఏమిటో చెప్పుకోవాలి గనుక.. అలాగని మీడియా అందరినీ పిలిస్తే వారి ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం తనకు లేదు కనుక.. ఇష్టమైన వారిని మాత్రం పిలుచుకున్నారు జగన్.
60 రోజులపాటు సెలవు చీటీ కూడా పెట్టకుండా నిరంతరాయంగా శాసనసభ సమావేశాలకు గైర్హాజరైతే గనుక సభ్యత్వం రద్దు అవుతుందనే నిబంధన గురించి మీడియా మిత్రులు ప్రస్తావించినప్పుడు జగన్ చాలా విచిత్రంగా స్పందించారు. ‘వారికి బుద్ధి పుట్టింది చేసుకోమని చెప్పండి నేను రెడీగా ఉన్నా’ అని జగన్ అన్నారు. దేనికి రెడీగా ఉన్నారో బహుశా ఆయనకు మాత్రమే అర్థమయి ఉంటుంది. ఆ మాట ద్వారా పులివెందుల ఉప ఎన్నికను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారని అంటున్నారో.. లేదా, తనపై అనర్హత వేటు వేస్తే న్యాయపోరాటం చేయడానికి రెడీగా ఉన్నారో ఆయనకే తెలియాలి.
అయితే ‘‘వారికి బుద్ధి పుట్టింది చేసుకోమని చెప్పండి.. ధైర్యం ఉంటే అనర్హత వేటు వేయమని చెప్పండి’’ అనే ఈ తరహా మాటలు జగన్ ఒక్కడు చెబితే సరిపోదు.. ఆయన అహంకారం కారణంగా తామెవ్వరు కూడా శాసనసభ సమావేశాలకు హాజరుకాకుండా ఇంట్లో కూర్చుని గోళ్లు గిల్లుకుంటున్న మిగిలిన పదిమంది ఎమ్మెల్యేలు కూడా చెప్పాలి! జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ఒకే ప్రెస్ మీట్ లో కూర్చొని తమ మీద అనర్హత వేటు వేయడం గురించి ప్రభుత్వానికి సవాలు విసరగలరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
శాసనసభకు వెళ్లి సమస్యలను ప్రస్తావించాల్సిన అవసరం లేదు.. మీడియా ముందు మాట్లాడితే చాలు.. మీడియా ద్వారా ప్రజలకు సంకేతం ఇవ్వగలిగితే చాలు.. అని జగన్మోహన్ రెడ్డి బీరాలు పలుకుతున్నారు. అయితే శాసనసభ జరుగుతున్న రోజులలో కూడా ప్రెస్ మీట్ లు పెట్టి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి మాత్రమే! అంటే ఆయన పార్టీకి చెందిన మిగిలిన పదిమంది ఎమ్మెల్యేలు ఐదేళ్లపాటు ఏ పని బాటా లేకుండా కూర్చోవాలని.. తద్వారా ప్రజలలో వారి పట్ల అసహ్య భావం ఏర్పడాలని జగన్ భావిస్తున్నారా అనే సందేహాలు కూడా పలువురులో కలుగుతున్నాయి! ‘అనర్హత వేటుపడినా ఓకే’ అనే జగన్ ధోరణికి మిగిలిన ఎమ్మెల్యేల మద్దతు ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రజలు తిట్టుకుంటారని బాధపడుతున్న తన సొంత పార్టీ ఎమ్మెల్యేల రక్తకన్నీరు జగన్ కు కనిపించడం లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మీ ఎమ్మెల్యేల రక్తకన్నీరు కనపడ్డం లేదా జగన్!
Wednesday, April 2, 2025
