వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన కాలం నాటి పాపాల ఫలితంగా.. పరారీలోకి వెళ్లిన వారి సంఖ్య రెట్టింపు అయింది. చిన్నా సన్నా కేసుల్లో నిందితులుగా ఉంటూ.. పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉంటున్న వారి సంఖ్య లెక్కేలేదు. కీలక నిందితులుగా ఉంటూ, ఎవరు దొరికితే పార్టీ కూసాలు కదులుతాయని అంతా అనుకుంటున్నారో.. అలాంటి వారు పరారీలో ఉండడం విశేషం. ఇప్పటిదాకా అలాంటినేతలు ముగ్గురు పరారీలో ఉండగా.. ఇప్పుడు ఆసంఖ్య ఆరుకు చేరింది. కొత్తగా పరారైన ముగ్గరూ నాయకులు కాదు.. అధికారులు! జగన్ కు అత్యంత ఆత్మీయులు!
మద్యం కుంభకోణం కేసులో వసూళ్లు అయిన మొత్తం డబ్బు మూటలను అంతిమ లబ్ధిదారుకు అందేలాగా కీలక భూమిక పోషించిన వ్యక్తులుగా ఇప్పటిదాకా విచారణలో నిగ్గుతేలిన ముగ్గురు ఇప్పుడు పరారయ్యారు. జగన్ ప్రభుత్వంలో ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనునంజయరెడ్డి, భారతి సిమెంట్స్ డైరక్టరు గోవిందప్ప బాలాజీ ముగ్గురూ లిక్కర్ కేసులో నిందితులే. తన నెట్ వర్క్ ద్వారా వసూలు అయ్యే సొమ్ములను వారికి చేర్చడం వరకే తన బాధ్యత అని కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి పోలీసులకు వాంగ్మూలంలో తెలియజెప్పిన సంగతి కూడా అందరికీ తెలుసు. ఆ తర్వాత వారి పేర్లు నిందితుల జాబితాలోకి చేరాయి.
ఆ ముగ్గురూ ఇటు హైకోర్టులోనూ, తర్వాత సుప్రీం కోర్టులోనూ ముదస్తు బెయిళ్ల కోసమూ, అరెస్టు నుంచి రక్షణ కోసమూ పిటిషన్లు నడిపారు గానీ.. ఫలితం దక్కలేదు. న్యాయస్థానాలు ఆ పిటిషన్లను తిరస్కరించాయి. ఫైనల్ గా డబ్బు పుచ్చుకున్న వ్యక్తులుగా అనుకుంటున్న వీరు.. అంతిమ లబ్ధిదారుగా ఎవరికి ఆ డబ్బులు చేర్చారు అనేది తేలాల్సి ఉంది. ధనుంజయరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి జగన్ కు విశ్వసనీయులు కాగా.. గోవిందప్ప బాలాజీ వైఎస్ భారతికి విధేయుడు. ఈ ముగ్గురికీ విచారణకు రావాల్సిందిగా సిట్ పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. కోర్టుల్లో పిటిషన్లు వేసినప్పటినుంచి వారు పరారీలోనే ఉన్నందున.. వారి కుటుంబసభ్యులకు నోటీసులు అందించారు.
అయితే ప్రజలు మాత్రం.. ఆ ముగ్గురు కూడా వీఐపీలు కావడం వలన.. దేశం దాటి పరారయ్యే ప్రమాదం ఉన్నదని.. అలాంటి పరిస్థితి రాకుండా ముందే లుకౌట్ నోటీసులు జారీచేయాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానిస్తున్నారు. అదే జరిగితే.. కేవలం ముడుపుల రూపేణా 3500 కోట్ల స్వాహా చేయడం మాత్రమే కాకుండా.. హవాలా ద్వారా ఆ డబ్బును దేశం దాటించిన పాపాలకు కూడా పాల్పడిన అసలు నిందితుల జాడ చిక్కదని అంటున్నారు. దేశం దాటాక.. అనుకుని లాభం లేదని.. ముందుగానే వారి గురించి లుకౌట్ నోటీసులు జారీచేస్తే ఏదో ఒక నాటికి ఇక్కడే పట్టుబడతారని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. మరి సిట్ పోలీసులు ఆ దిశగా కార్యచరణకు దిగారో లేదో తెలియాలి.
ఆ ముగ్గురిపై లుకౌట్ నోటీసులు ఇచ్చారా?
Tuesday, December 9, 2025
