కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్క నేత భయపడుతూ బతుకుతున్నారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎవ్వరైతే జగన్ అధికారంలో ఉన్న అయిదేళ్ల కాలంలో కూడా.. ఇష్టారాజ్యంగా మాట్లాడకుండా.. అతి చేయకుండా తమ పని తాము చేసుకుంటూ ఉండిపోయారో.. వారందరూ ఇప్పుడు నిశ్చింతగానే ఉన్నారు. కానీ.. అధికారంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తించిన వారందరికీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను, నారా లోకేష్ ను మీడియా ముందు బండబూతులు తిట్టడంలో ఘనాపాటి అనిపించుకున్న మాజీ మంత్రి కొడాలి నానికి కూడా అరెస్టు భయం ఉంది. వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత.. వేరు సందర్భాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏం చేస్తారో చేసుకోమనండి.. మహా అయితే అరెస్టు చేస్తారు.. అంతే కదా..’ అంటూ అదే దూకుడు ప్రదర్శించారు. తన నోటివెంబడి ధారాళంగా ప్రవహించే బూతులను మాత్రం తనే సెన్సార్ చేసుకుని ఆయన ఈ మాటలు అన్నారు. అయితే తాజా పరిణామాలను గమనిస్తోంటే.. త్వరలోనే ఆయనను అరెస్టు చేయడానికి ఏపీ పోలీసులు సిద్ధమవుతున్నారనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. ఎందుకంటే.. ఆయన తనకు ఒంట్లో అస్వస్థతగా ఉన్నదంటూ.. హైదరాబాదులోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు.
గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న కొడాలి నాని మంగళవారం రాత్రి చికిత్స నిమిత్తం హైదరాబాదు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. అవసరమైన వైద్య పరీక్షలు అన్నీ నిర్వహించిన తర్వాత కొడాలి నానికి గుండె సమస్య ఉన్నట్టుగా వైద్యులు నిర్ధరించారు. బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు నిర్ణయించారు. అలాగే, కిడ్నీ సమస్య కూడా ఉందని చెబుతున్నారు. ఏఐజీ ఆస్పత్రి వైద్యులు ఆయన హెల్త్ పరిస్థితిపై బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. అప్పటికి ఆయనకు ఏమైంది? ఏం జరుగుతుంది? అనే విషయంలో పూర్తి స్పష్టత వస్తుంది.
అయితే.. కొడాలి నాని మీద కూడా వివిధ రకాల కేసులు ఆల్రెడీ నమోదై ఉన్నాయి. కేవలం ప్రత్యర్థి నేతలను బండబూతులు తిట్టడం మాత్రమే కాదు.. ఇంకా అవినీతి అక్రమాలకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. ఎవరి మీద ఎలాంటి కేసులు ఉన్నా.. పూర్తి సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత మాత్రమే.. ప్రభుత్వం ప్రస్తుతం చర్యలకు ఉపక్రమిస్తోంది. ఆ క్రమంలో భాగంగా.. త్వరలోనే తన అరెస్టుకు కూడా పోలీసులు రాబోతున్నారనే సమాచారంతో కొడాలి నాని ఏఐజీ ఆస్పత్రిని ఆశ్రయించారా? అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. ఒక వయసు దాటిన తర్వాత.. ఎవరికి వైద్యపరీక్షలు చేసినా.. ఏదో ఒక గుండె సంబంధిత సమస్య బయటపడుతుందని.. కొడాలి నాని కేసుల భయంతో గ్యాస్ట్రిక్ సమస్య పేరుతో ఆస్పత్రికి వెళ్లగా అక్కడి పరీక్షల్లో గుండె సమస్యలను గుర్తించి ఉండివచ్చునని ప్రజలు అనుకుంటున్నారు.
అరెస్టు సంకేతాలు అందాయా? ఆస్పత్రిలో చేరిన కొడాలి నాని!
Saturday, March 29, 2025
