ఎస్పీ పై వేటు వేశాక వారిలో చలనం వచ్చిందా? 

Sunday, December 22, 2024

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సోషల్ మీడియాలో చెలరేగిపోతూ అధికార కూటమి పార్టీలకు చెందిన నాయకుల కుటుంబ సభ్యులు ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యమైన, నీచమైన బూతు పోస్టులను పెట్టడం.. వాటిని సర్కులేట్ చేయడం అనే దుర్మార్గంలో కూడా అతిరథులు మహారథులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో జగన్మోహన్ రెడ్డి భార్య భారతి పిఏ వర్రా రవీందర్ రెడ్డి కూడా ఒకరు. జగన్ ఏలుబడి సాగుతున్న రోజులలో అధికార పార్టీ అండ చూసుకొని విచ్చలవిడి అసభ్యకర పోస్టులతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారిని సోషల్ మీడియాలో నిందిస్తూ వర్రా రవీందర్ రెడ్డి చెలరేగిపోయారు ఆయనను పట్టుకున్న కడప పోలీసులు 41 ఏ నోటీసు ఇచ్చి మరో కేసులో అరెస్ట్ కోసం ప్రొద్దుటూరు పోలీసులు వచ్చినప్పటికీ వారిని పట్టించుకోకుండా వదిలి పెట్టేసారు. ఆగ్రహించిన ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం ఏకంగా కడప జిల్లా ఎస్పి పై బదిలీ వేటు వేసింది. సాక్షాత్తు ఎస్పీ మీదనే వేటు పడిన తర్వాత కడప జిల్లా పోలీసులలో చురుకు పుట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డిని వెతికి అరెస్టు చేయడానికి వారు నానాపాట్లు పడుతున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ ఇంటికి కూడా  వెళ్లడం గమనార్హం.

వైయస్ భారతి పీఏ గా ఉంటూ ఆమె అండ చూసుకొని వర్రా రవీందర్ రెడ్డి విచ్చలవిడిగా సోషల్ మీడియా పోస్టులు పెట్టారు. ఆయన దుర్మార్గపు పోస్టులకు కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వంగలపూడి అనిత కుటుంబాలు మాత్రమే కాదు.. జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల కూడా బలయ్యారు! వైయస్ షర్మిల స్వయంగా వర్రా రవీందర్ రెడ్డి అసభ్యకరమైన పోస్టుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. జగన్ జమానాలో ఆ ఫిర్యాదు బుట్ట దాఖలైంది. ఇన్ని దుర్మార్గాలు జరిగినప్పటికీ పోలీసుల అదుపులోకి వచ్చి, ఇంటి అల్లుడు లాగా అతిధి మర్యాదలు స్వీకరించి, 41 ఏ నోటీసు కూడా స్వీకరించి తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం చర్చనీయాంశం. పోలీసులు ఆయనతో కుమ్మక్కయ్యారు అనేది ఒక ఆరోపణ కాగా.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అలాగే వైయస్ భారతి కూడా జిల్లా ఎస్పీతో మాట్లాడి ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు ఉన్నాయి. కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ తర్వాత గాని కడప పోలీసులలో కదలిక రాలేదు. ఎలాగైనా సరే పరారీలో ఉన్న వర్రా రవీందర్ రెడ్డిని పట్టుకోవడానికి వారు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో భాగంగానే ఎంపీ అవినాష్ రెడ్డి పిఎ రాఘవరెడ్డి ఆయనతో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆయన నుంచి వివరాల సేకరించినందుకు రాఘవరెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో లేరని కుటుంబ సభ్యులు చెప్పడంతో వారు ఉత్త చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొల్పేందుకు వైసిపి కార్యకర్తలు ప్రయత్నించడం విశేషం. రాఘవరెడ్డి ఇంట్లో లేరు అని చెప్పడానికి కూడా లాయర్ ఓబుల్ రెడ్డి వచ్చి పోలీసులతో మాట్లాడడం అనుమానాలు రేకెత్తిస్తోంది. కనీసం వర్ర రవీంద్ర రెడ్డిని సత్వరం అరెస్టు చేయడానికి కడప పోలీసులు చురుగ్గా కదులుతుండడం మంచి పరిణామం అని పలువురు విశ్లేషిస్తున్నారు. సోషల్ మీడియాలో చెత్త పోస్టులతో చెలరేగిపోయే వారికి ఇది ఒక గుణపాఠం అవుతుందని అంటున్నారు!

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles