మద్యం కుంభకోణంలో మరీ ఇంత బరితెగించారా?

Wednesday, December 10, 2025

సాధారణంగా లంచాలు తీసుకోవడం అంటే ఎలా జరుగుతుంది? ఒక వ్యక్తి ప్రభుత్వం నుంచి ఒక పని నెరవేర్చుకోవాలంటే.. సంబంధిత అధికారిని ఆశ్రయిస్తారు. ఆ పని ద్వారా ఒనగూరే ప్రయోజనం పొందడానికి ఆ వ్యక్తికి పూర్తి అధికారం, హక్కులు ఉన్నా సరే.. అతనికి ప్రయోజనం కలుగుతుంది గనుక.. ఆ పనిని చేయడానికి ప్రభుత్వంలోని అధికారి లేదా నాయకుడు తనకు కొంత డబ్బు లంచంగా ముట్టజెప్పాలని అడుగుతాడు. ఏదో ఒక రకంగా తనకు పని పూర్తికావడమే ముఖ్యం అనుకునే వ్యక్తి ఆ లంచం ఇచ్చేసి నెరవేర్చుకుంటాడు. అలా కాకుండా.. ఆ వ్యక్తికి ఆ పనిని పొందే అర్హతే లేకపోయినా.. అలాంటి పనిని అడ్డదారుల్లో చేసి పెట్టడానికి కూడా ప్రభుత్వాధికారులు, నాయకులు వెనకాడరు. కాకపోతే అలాంటి సందర్భాల్లో పుచ్చుకునే లంచాన్ని భారీగా పెంచేస్తారు. తను పొందేదే అక్రమ ప్రయోజనం గనుక సదరు వ్యక్తి కూడా ఇవ్వడానికి మొగ్గుచూపుతాడు. సాధారణంగా లంచాలు ఈ రెండు పద్ధతుల్లోనే జరుగుతాయి. అంటే లంచం అనే ప్రక్రియకు ఇరువైపులా ఉండేవారి ఒప్పుకోలుతోనే జరుగుతాయి. కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో బరితెగింపు ఎలా ఉండేదో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. లంచాలు ఇవ్వడానికి ఇష్టపడని వారిని, అసలు అడ్డదారుల్లో ప్రయోజనం పొందడానికే ఇష్టపడని వారిని కూడా బెదరించి, తుపాకీ చూపించి మరీ హెచ్చరించి, భయపెట్టి నానా రకాలుగా వేధించి లొంగదీసుకుని.. ఆ తర్వాత ముడుపులు తీసుకునే వారని తెలిస్తే ఆశ్చర్యపోతాం.

సంపూర్ణ మద్యనిషేధం అమలులోకి తెస్తానని ప్రజలకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అదే మద్యం వ్యాపారాన్ని తన సొంత ఖజానా నింపుకోవడానికి మార్గంగా మార్చుకున్నారు. మద్యనిషేధం దిశగా అడుగులు వేస్తున్నాం అని మోసపూరిత ప్రకటన చేశారు. ప్రజలలో మద్యం అలవాటు మాన్పించడం ద్వారా.. నిషేధం తెస్తాననే కల్లబొల్లి మాటలతో, అలా మాన్పించడం కోసం అన్నట్టుగా మద్యం ధరలను విపరీతంగా పెంచారు. ఆ పెంచిన వ్యత్యాసం మొత్తం తనకు ముడుపులుగా సమర్పించుకున్న కంపెనీలకు, డిస్టిలరీలకు మాత్రమే ఆర్డర్లు కట్టబెట్టారు. పెద్ద బ్రాండ్లు, పాపులర్ బ్రాండ్లు తన లోపాయికారీ ఒప్పందాలకు లొంగవు గనుక ఆ బ్రాండ్లేవీ ఏపీలో అసలు దొరక్కుండా అమ్మకుండా చేసేశారు. ఇంతవరకు ఊరుకుంటే కూడా సరిపోయేది. తమకు పెంచిన ధరల తేడాను ముడుపులుగా కట్టబెట్టే వారికి మాత్రమే ఆర్డర్లు ఇచ్చుకుంటే సరిపోయేది. అలా ఒకటిరెండు కంపెనీలకు మాత్రమే  ఆర్డర్లు ఇస్తే భ్రష్టుపట్టిపోతాం అని వారు  భయపడ్డారు. అందుకే.. మిగిలిన డిస్టిలరీలు, మద్యం తయారీదార్లు అందరూ కూడా తమ ముడుపుల ప్రతిపాదనకు ఒప్పుకునేలా వారిని బెదిరించారు, వేధించారు. ఎంతగా అంటే.. ఎంపీ అవినాష్ రెడ్డి,  ఆయన తండ్రి భాస్కర రెడ్డి ల సన్నిహితుడైన హనుమంతరెడ్డి అనే వ్యక్తితో డిస్టిలరీల ప్రతినిధిని తుసాకీ చూపించి మరీ బెదిరించడం వెలుగులోకి వచ్చింది.

లంచాల కోసం కూడా బెదిరించి, వేధించి లొంగదీసుకుని పుచ్చుకోవడం అనేది చిత్రమైన వ్యవహారం. అంతగా భ్రష్టుపట్టిపోయేలా.. జగన్ సర్కారు బరితెగించి లిక్కర్ కుంభకోణంలో కాజేసిందని ఇప్పుడు అర్థమవుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles