వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజుల్లో.. భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర సారథిగా ఉంటూ.. జగన్ అనుకూల వైఖరితో పార్టీని ఎదగనివ్వకుండా చేశారనే ఆరోపణలను బాగా మూటగట్టుకున్న వ్యక్తి సోము వీర్రాజు. నిజానికి ఏపీలో జగన్ ను పతనం చేయడానికి మూడు పార్టీలు కలిసి పొత్తులు పెట్టుకోవడానికి మంతనాలు జరుగుతున్న సమయంలో.. తీవ్రంగా వ్యతిరేకించారు కూడా. ఆయన ఆలోచనలకు భిన్నంగా జాతీయస్థాయిలో బిజెపి విస్తృతప్రయోజనాలను లక్ష్యించబట్టి పొత్తులు సాకారం అయ్యాయి. సోము వీర్రాజు ఎన్నికల ప్రచార సమయంలో కూడా అంటీముట్టనట్టుగానే వ్యవహరించారు. కానీ కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. అనూహ్యంగా ఢిల్లీ పెద్దలతో చక్రంతిప్పించి.. ఎమ్మెల్సీ స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత మాత్రం అడపాదడపా జగన్ మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు.
మొత్తానికి ఒకప్పుడు జగన్ అనుకూల వైఖరితో.. జగన్- చంద్రబాబును ఎలా దూషిస్తే ఆ విమర్శలను కొనసాగించడానికి ఉపయోగపడుతూ వచ్చిన సోమువీర్రాజుకు ఆ మాజీ ముఖ్యమంత్రి గురించి ఇన్నాళ్లకు స్పష్టత వచ్చినట్టుంది. జగన్ మాటలు హేతుబద్ధంగా లేవంటూ ఆయన నిప్పులు చెరగుతున్నారు. జగన్ దాదాపుగా ప్రతి మీటింగులోను ఇప్పుడు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వడ్డీతో సహా సమస్తం తిరిగి చెల్లిస్తాం అంటూ రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మాటలు, వాటి ద్వారా ప్రభుత్వ అధికారుల్ని బెదిరించడం మంచి పద్ధతి కాదని సోము వీర్రాజు- జగన్ కు హితవు చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామనే సంగతి మర్చిపోయి జగన్ ఇష్టరాజ్యంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
‘జగన్ పూర్తి అజ్ఞానంతో మాట్లాడుతున్నారు’ అని ఎద్దేవా చేస్తున్న సోము- సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు ఇప్పుడు ఎలాంటి దుర్గతి పట్టిందో గుర్తు చేస్తున్నారు. జగన్ తన జమానాలో పోలీసు అధికారులను ఇంటి పాలేర్లలా ఇష్టానుసారం వాడుకున్నారనే సంగతి అందరికీ తెలుసు. కేవలం ఉద్యోగుల నిరసనల్ని ఉక్కుపాదంతో అణచివేయలేదనే కోపంతో డీజీపీని లూప్ లైన్ కు పంపించిన ఘనుడు ఆయన. తన దందాలు మొత్తం యథేచ్ఛగా నడిపించడానికి పీఎస్సార్ ఆంజనేయులును వాడుకుంటే.. ఆయన ప్రస్తుతం బెయిలు మీద బయటకు వచ్చి ఏ శిక్ష పడుతుందో.. ఎన్నాళ్లు జైల్లో గడపాలో అనే భయంతో జీవిస్తున్నారు. అందుకే సోము వీర్రాజు- జగన్ కు హెచ్చరిక చేస్తున్నారు.
తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి అధికార్లకు ఏ గతి పడుతుందోనని హెచ్చరిస్తున్న జగన్.. ముందు తన హయాంలో తన తొత్తుల్లా పనిచేసిన అధికారులు ఇప్పుడు ఏగతిలో ఉన్నారో చూసుకోవాలని కూడా సోము వీర్రాజు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు.. ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి డొంకతిరుగుడుగా మాట్లాడాల్సిన అవసరం లేదు అని సోముకు క్లారిటీ వచ్చినట్టుగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.
జగన్ గురించి సోముకు క్లారిటీ వచ్చిందా?
Friday, December 5, 2025
