వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారం సినిమాల్లో జరిగే హత్యానంతర దారుణాలను తలపిస్తోంది. ఆరేళ్లుగా ఇంకా దోషులు ఎవరో తేలనేలేదు. విచారణ సా..గుతూనే ఉంది. ఈలోగా ఈ కేసులో కీలక సాక్షులుగా ఉన్న ఆరుగురు వేర్వేరు కారణాల వల్ల.. అసహజమరణాలకు గురయ్యారు. అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి ఒక్కడూ బాహ్యప్రపంచంలో ప్రాణాలతో ఉన్నాడు. అయితే దస్తగిరి ప్రాణాలకు ముప్పు పెరిగిందా? కేవలం దస్తగిరికి మాత్రమే కాదు.. అతనికుటుంబానికంతటికీ ప్రాణాపాయం ఉన్నదా? అనే భయాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి.
వైఎస్ వివేకానందరెడ్డి ఇంటివద్ద పనిచేసే రంగన్న ఇటీవల ఆస్పత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దస్తగిరి తనకు ప్రాణభయం ఉన్నదని సెక్యూరిటీ పెంచాలని కోరారు. పోలీసులు అతనికి భద్రత పెంచి 2+2 భద్రత కల్పించారు. అయితే వ్యవహారం కేవలం దస్తగిరితోనే సరిపోయేలా లేదు. ఆయన భార్య మీద వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలైన ఇద్దరు మహిళలు దాడిచేసి తీవ్రంగా కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. పులివెందుల నియోజకవర్గం మల్యాలలోని బంధువుల ఇంటికి దస్తగిరి భార్య షాబానా వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరు మహిళలు శంషున్, పర్వీన్ లు ఆ ఇంటిలోకి చొరబడి విచక్షణా రహితంగా కొట్టినట్టుగా షాబనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా దస్తగిరి మాట్లాడతారా? అంటూ పదేపదే ప్రస్తావిస్తూ తనను కొట్టినట్టుగా చెప్పారు. ఏడాదిలోగా దస్తగిరిని కూడా చంపేస్తాం అని బెదిరించినట్టుగా ఆమె చెబుతున్నారు.
అయితే ఈ విషయంలో దాడిచేసిన మహిళలపై ఫిర్యాదుచేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదని షబానా చెబుతుండడం గమనార్హం. దస్తగిరి ఈ కేసులో అవినాష్ రెడ్డి అండ్ కో కు కొరుకుడు పడని వ్యక్తిగా తయారయ్యాడని పలువురు భావిస్తున్నారు. దస్తగిరిని లొంగదీసుకోవడానికి.. అతను మరో కేసులో జైల్లో ఉండగానే.. 20 కోట్ల రూపాయల బేరంతో ఆఫర్ పంపినట్టుగా కూడా గతంలో ఆరోపనలు వచ్చాయి. వాటిపై ఇటీవలే విచారణ కూడా జరిగింది. మరొకవైపు సాక్షులందరూ ఒక్కొక్కరుగా చనిపోతుండడంతో దస్తగిరి ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నట్టే!
తాజా సంఘటనలో ఆయన భార్యపై ఇద్దరు వైసీపీ మహిళలు దాడిచేయడాన్ని గమనిస్తే.. దస్తగిరి మీద కూడా ఇలాంటి వ్యూహాత్మక దాడి జరుగుతుందా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. సినిమాల్లో ఎవ్వరికీ అనుమానం రాని విధంగా మహిళల్ని, పిల్లల్ని ఉపయోగించి హత్యలు చేయించడాన్ని గమనిస్తుంటాం. తాజాగా మల్యాలలో దాడిని గమనిస్తే.. దస్తగిరి మీద కూడా అలాంటి ప్రయత్నం జరుగుతుందేమో అని అనుకోవాల్సి వస్తోంది.
దస్తగిరి ప్రాణాలకు ముప్పు పెరిగిందా?
Tuesday, March 18, 2025
