జగన్మోహన్ రెడ్డి రాజ్యం చేసిన అయిదేళ్ల కాలంలో ఆయన చేపట్టిన ఏకైక నిర్మాణకార్యక్రమం రుషికొండ ప్యాలెస్ మాత్రమే. ప్రకృతివిధ్వంసం జరిగిపోతున్నదని.. పర్యావరణ ప్రేమికులందరూ నెత్తీనోరూ బాదుకుంటున్నా వారి గోడు చెవిన వేసుకోకుండా.. అతిథిభవనాల ముసుగులో జగన్మోహన్ రెడ్డి తన కుటుంబం కోసం నివాసాలు కట్టించుకున్నారు. శాశ్వతంగా ఆ నివాసాల్లో తానే రాజ్యమేలబోతానని కలలు కన్నారు. అలాంటి రుషికొండ ప్యాలెస్ ను ఒక్కరోజు నివసించడానికి యోగ్యంగా కూడా తయారు కాకముందే… ఎన్నికల యావతో.. విశాఖకు రాజధాని తరలివస్తోందని అక్కడి ప్రజలను భ్రమపెట్టి వారి ఓట్లు వేయించుకోవాలని దురూహతో ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి.. శ్రీసిటీలో పరిశ్రమలు తన హయాంలో వచ్చినవే పూర్తయ్యే దశకు చేరుకుని ఉంటే.. ఎన్నికలకు ముందు వాటిని ఎందుకు ప్రారంభించలేదు అనేది ఇప్పుడు ప్రజలకు ఎదురవుతున్న సందేహం.
తిరుపతి జిల్లా శ్రీసిటీలో చంద్రబాబునాయుడు ఒకే రోజు 16 పరిశ్రమలను ప్రారంభించి కొన్నింటికి శంకుస్థాపనలు కూడా చేసిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులందరికీ కడుపుమంట తారస్థాయికి చేరిపోతోంది. పరిశ్రమల మంత్రిగా ఉండి నయాపైసా రాష్ట్రానికి ఉపయోగపడే పని చేయలేకపోయిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు తెరమీదకు వచ్చి పడికట్టు మాటలతో క్రెడిట్ తాము తీసుకోవాలని చూస్తున్నారు.
ఇప్పుడు శ్రీసిటీలో ప్రారంభించినవన్నీ 2023 మార్చిలో విశాఖలో జరిగిన జీఐఎస్ సదస్సులో చేసుకున్న ఒప్పందాలతో ఏర్పడిన పరిశ్రమలేనట. ఇక్కడే అసలు కామెడీ దాగి ఉంది. అదేనిజమైతే.. రెండునెలల కిందటి సమయానికి అవి కనీసం పూర్తయ్యే దశలో ఉండే ఉంటాయి కదా? జగన్ సర్కారుకు చిత్తశుద్ది ఉంటే వారిని కాస్త తొందరపెట్టి ఎన్నికల కోడ్ కు ముందుగా ప్రారంభించి ఉండేవారు కదా అనేది ప్రశ్న. రుషికొండ ప్యాలెస్ మాత్రం పూర్తికాకుండానే ప్రారంబించేసిన జగన్, శ్రీసిటీ పరిశ్రమలను అదే డ్రామాలాగా ప్రారంబించి ఉండొచ్చు కదా అని ప్రజలు అడుగుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి కనీసం ఎన్నికల ప్రచారం వేళలో శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరు పేట నియోజకవర్గాల పరిధిలో ప్రచారం నిర్వహించినప్పుడైనా.. ఈ శ్రీసిటీలో నేను తీసుకువచ్చిన పరిశ్రమలు పలానావి పూర్తయ్యే దశలో ఉన్నాయి.. మీకు ఉద్యోగాలు వస్తాయి.. అనే మాట అనగలిగారా? అనేది ప్రజల సందేహం. అలాంటిదేమీ లేకుండా ఇప్పుడు చంద్రబాబునాయుడు వాటిని ప్రారంబించగానే అక్కసు పట్టలేక గుడివాడ నోరు పారేసుకుంటున్నారని ప్రజలు అంటున్నారు.
రుషికొండపై శ్రద్ధ శ్రీసిటీపై లేకుండా పోయిందా?
Sunday, December 22, 2024