మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా రాజ్యం చేస్తున్న రోజుల్లో కనిపెట్టిన కొత్త పద్ధతి గ్రామవాలంటీర్లు.! ఈ వాలంటీర్లు జిందా తిలిస్మాత్ లాంటి వారని జగన్మోహన్ రెడ్డి భావించారు. ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు తీసుకెళ్లి ఇవ్వడానికి ప్రభుత్వం తరఫున వీరు క్షేత్రస్థాయిలో ఉండి పనిచేస్తారని జగన్ తలపోశారు. అలాగే.. లబ్ధిదారులను తరచుగా కలుస్తూ తన భజన చేస్తూ ఉండడానికి, తాను భగవత్ స్వరూపుడిని అని… తాను లేకపోతే అసలు పేదల జీవితాలు అగమ్యగోచరం అయిపోతాయని ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ వాలంటీరు వ్యవస్థ ఉపయోగపడుతుందని జగన్ గట్టిగానమ్మారు. తన పార్టీ నాయకులు, అభ్యర్థులు అందరూ కూడా వాలంటీర్లను నెత్తిన పెట్టుకుని పనిచేయాలంటూ జగన్ హుకుం జారీ చేశారు. ఇదంతా గతం కాగా, ఇప్పుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. అనకాపల్లి జిల్లాకు పార్టీ సారథిగా నియమితుడైన తర్వాత.. వాలంటీర్ల వల్లనే గత ఎన్నికల్లో ఓడిపోయాం అని చెప్పడం పూర్తిగా జగన్ వ్యూహాల మీదనే ఎటాక్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
క్షేత్రస్థాయిలో జగన్ భజన చేయడానికి వాలంటీర్లు కీలకమైనవారుగా అప్పటి సీఎం భావించారు. జగన్ మళ్లీ రాకపోతే.. పథకాలన్నీ ఆగిపోతాయంటూ.. ఇంటింటికీ వారిని తిప్పి విస్తృతంగా ప్రచారం చేయించారు. ఎన్నికల వేళ వారిద్వారా బాగా మానిప్యులేట్ చేయవచ్చునని ఆశించారు. జగన్ పురమాయింపు మేరకు ప్రతిచోటా అభ్యర్థులు వాలంటీర్లతో విడివిడిగా సమావేశాలు పెట్టుకుని.. వారందరికీ భారీగా కానుకలు, నగదు భారీగా సమర్పించుకుని.. ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేయాలని వేడుకున్నారు. ఈలోగా ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించడంతో పాటు, నాయకుల వెంట ప్రచారంలో కనిపిస్తే ఎక్కడికక్కడ వారి మీద వేటు వేసేసేలా ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ దెబ్బతో ఏ వక్రప్రయోజనాలను ఆశించి వాలంటీరు వ్యవస్థను జగన్ సర్కారు పెంచి పోషించిందో.. ఆ కార్యం నెరవేరలేదు. ఇప్పుడు అదే విషయంపై గుడివాడ అమర్నాథ్ గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లను రాజీనామా చేసేసి తమవెంట రావాల్సిందిగా సూచించామని, అయితే వారు తమ మాట వినలేదని ఆయన వాపోతున్నారు. వాలంటీరు వ్యవస్థ వల్లనే అధికారం కోల్పోయామని ఆయన అంటున్నారు. ఇండైరక్టుగా ఏం కాదు.. డైరక్టుగానే ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యూహచాతుర్యాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా.. జగన్ వాలంటీర్లకు పెద్దపీట వేయడం వల్లనే తామందరం ఓటమి పాలయ్యామని చెబుతున్నట్టుగా ఉంది.
