సిట్ పోలీసులు తనను అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్నారనే సంగతి.. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుకు వారం రోజులు ముందే తెలుసు. బహుశా అంత ముందుగా.. పోలీసు బాస్ లకు అయినా తెలుసో లేదో! కానీ అసలు నిందితుడికి తెలిసిపోయింది. ఈ విషయంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరమేం టేదు. ఆయనేమీ చిన్నాసన్నా వ్యక్తి కాదు. ఏపీ ప్రభుత్వంలో నిఘావిభాగానికి సర్వాధికారిగా వ్యవహరించినవాడు. ఆయన పట్ల భక్తి ప్రపత్తులు ఉండే వేగులు ఇంకా ఆ శాఖలో ఉండే అవకాశమూ ఉంది. వారు ఆయనకు సహకరించే అవకాశమూ ఉంది. మరి గోరంట్ల మాధవ్ పరిస్థితి ఏమిటి? ఆయన పోలీసు శాఖలో ఉన్న రోజులలో ఒక సాధారణ సీఐ. ఆ కొలువు మానేసి జగన్ తీర్థం పుచ్చుకుని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ అయ్యాడు. ఒక టర్మ్ మాత్రమే. జగన్ కే చిరాకేసి తర్వాత టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టేశాడు. అలాంటి వ్యక్తికి కూడా కూటమి ప్రభుత్వం పాలనలో పోలీసుశాఖలో ఇంత హవా నడుస్తుందా? ఆయనకు పోలీసులు రకరకాలుగా ఫేవర్ చేసే పరిస్థితులను గమనిస్తోంటే.. రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఏడాది గడుస్తున్నా ఏపీ పోలీసు శాఖ ఇంకా జగన్ భక్తులతోనే నిండి ఉన్నదా అనే అనుమానం కలుగుతోంది.
మాజీ సీఐ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రస్తుతం గుంటూరు పోలీసుల కస్టడీలో ఉన్నారు. కానీ విచారణకు మాత్రం సహకరించకుండా పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇంకా సూటిగా చెప్పాలంటే.. పోలీసులు కూడా ఆయన చూపిస్తున్న చుక్కలు లెక్కపెట్టుకోవడం మీద కనబరుస్తున్న శ్రద్ధ.. ఆయన నుంచి వివరాలు రాబట్టడం మీద పెట్టలేకపోతున్నారనే విమర్శలు కూడా ప్రజల్లో వినిపిస్తున్నాయి.
పోలీసులమీదనే దౌర్జన్యం చేయడంతో పాటు వారు తరలిస్తున్న నిందితుడి మీద, ఎస్పీ కార్యాలయం ఆవరణలోనే దాడి చేసి కొట్టడం వంటి దుర్మార్గాలకు పాల్పడినందుకు గోరంట్ల మాధవ్ ప్రస్తుతం రిమాండులో ఉన్నారు. ఆయనను రెండురోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతించింది. బుధ గురువారాలు విచారించేందుకు గుంటూరు పోలీసులు అనుమతి తీసుకోగా.. బుధవారం నాడు ఉదయం పదిన్న ర గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కస్టడీకి తీసుకునేసరికి మధ్యాహ్నమైంది. పన్నెండున్నర సమయంలో ఎస్కార్టు మినీ బస్సులో మాధవ్ తో కలిసి బయల్దేరి గుంటూరు చేరేసరికి సాయంత్రం దాటింది. వైద్యపరీక్షలు చేయించి పోలీసు స్టేషనుకు తీసుకెళ్లేప్పటికి రాత్రి అయింది. తొలిరోజు నామమాత్రం వారు కొన్ని ప్రశ్నలు అడిగారు. గోరంట్ల సహజంగానే ఆ ప్నశ్నలకు సరైన జవాబులు ఇవ్వలేదు. తనకు తెలియదంటూ సమాధానం దాటవేశారు.
వైఎస్ భారతిపై అసభ్య పోస్టులు పెట్టిన చేబ్రోలు కిరణ్ ను పోలీసులు తరలిస్తున్న సంగతి గోరంట్ల మాధవ్ కు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? అనేదే కీలకం కాగా, దానికి ఆయన జవాబు చెప్పలేదు.
అయితే రెండు రోజుల విచారణకు గోరంట్లను కోర్టు అనుమతిస్తే, ఒక రోజంతా వేస్టయిపోవడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని, గోరంట్లకు సహకరిస్తున్నారని కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కువ సేపు విచారించే పరిస్థితి లేకుండా కాలయాపన చేయడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. కనీసం గురువారం అయినా ఆయనను పూర్తిగా విచారిస్తారా? లేదా, సాయంత్రంలోగా మళ్లీ వైద్యపరీక్షలు పూర్తి చేయించి రాజమండ్రి సెంట్రల్ జైలులో అప్పగించాలి అని నెపం పెట్టి.. ఉదయం పదిన్నరకే తిరుగు ప్రయాణం బయల్దేరుతారా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిందిగానీ.. పోలీసుల్లో జగన్ భక్తులు ఇంకా అక్కడక్కడా కొలువుతీరి ఆయన దళాలకు సేవచేయడంలో నిమగ్నం అవుతున్నారనే విమర్శలూ వస్తున్నాయి.
గోరంట్లకు ఫేపర్లు : ఏపీ పోలీస్.. జగన్ భక్తులతో నిండిఉందా?
Tuesday, December 9, 2025
