అసలే ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్న జగన్మోహన్ రెడ్డికి తాజాగా మరొక షాక్ తగలనుంది. పిఠాపురం తాజా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. బుధవారం ఆయన తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయం ప్రకటించబోతున్నారు. ప్రజావత్యిరేకతను మూటగట్టుకున్న జగన్ ప్రభుత్వ విధానాల మీద కూడా పెండెం దొరబాబు ధ్వజమెత్తే అవకాశం ఉంది. అదే సమయంలో తన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నట్టు పెండెం ప్రకటించారు. ఆయన జనసేనలో చేరబోతున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
2024 ఎన్నికలకు ముందు జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆ పార్టీని చాలా దారుణంగా దెబ్బతీశాయి. జగన్ తాను పలు విడతలుగా, పలు మార్గాల్లో రాష్ట్రవ్యాప్తంగా చేయించుకున్న సర్వేలు అనేకం వైఎస్సార్ కాంగ్రెస్ ఓటమిని స్పష్టంగానే సూచించాయి. అయితే.. ఎదురుకాబోతున్న ఓటమికి కారణం తన పరిపాలన పట్ల ప్రజల్లో ఉండే విపరీతమైన వ్యతిరేకత అని గుర్తించడానికి జగన్ కు అహంకారం అడ్డొచ్చింది. అలా గుర్తించి ఉంటే ఆయన తన పరిపాలన సరళి మార్చుకుని ఉండేవారేమో. సర్వేల్లో తేలిన ఓటమికి కారణాలుగా ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకతగా పులిమేయదలచుకున్న జగన్.. తన సొంత ఎమ్మెల్యేలు పలువురికి టికెట్లు నిరాకరించారు. ఆ క్రమంలో పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కూడా రిక్తహస్తం ఎదురైంది. అక్కడినుంచి పవన్ కల్యాణ్ మీద పోటీచేయడానికి వంగా గీతను ఎంపిక చేశారు జగన్మోహన్ రెడ్డి.
అప్పట్లోనే పెండెం దొరబాబు అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకోగా.. జగన్ పిలిచి బుజ్జగించారు. పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ చేస్తానని మాట ఇచ్చినట్టుగా ప్రచారం జరిగింది. తీరా ఎన్నికల్లో పార్టీ ఏ స్థాయిలో సర్వనాశనం అయిందో అందరికీ తెలుసు. ఓటమి తర్వాత ఇప్పటికే ఇద్దరు తాజా మాజీ ఎమ్మెల్యేలు మద్దాళి గిరి, కిలారి రోశయ్య రూపంలో వైసీపీని వీడిపోయారు. తాజాగా మరో ఎమ్మెల్యే పెండెం కూడా పార్టీని వీడుతున్నారు. అయితే పెండెం దొరబాబు జనసేనలో చేరుతున్నట్టుగా పుకార్లు స్థానికంగా వినిపిస్తున్నాయి. తెలుగుదేశంలో చేరినా సరే.. స్థానికంగా రాజకీయ భవిష్యత్తు ఉండదని.. పిఠాపురంలో బలమైన తెలుగుదేశం నేత వర్మ ఉండగా.. తనకు ప్రాధాన్యం దక్కదని, అందుకే జనసేనలో చేరితే కనీసం పవన్ కల్యాణ్ లోకల్ ప్రతినిధిగా తానే చెలామణీ కావొచ్చునని పెండెం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
జగన్ కు పెండెం గుడ్ బై : ఇక పవన్ చెంతకే!
Tuesday, November 12, 2024