వీఐపీ బ్రేక్ దర్శనం హోదాలో స్వామివారిని సేవించుకోవడానికి ఒక్కొక్కరికి పదివేల రూపాయల వంతున శ్రీవాణి ట్రస్టుకు విరాళంగా ఇచ్చి బ్రేక్ దర్శన టికెట్ పొందే ఏర్పాటు ఇక సులభతరం కానుంది. శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులు.. దర్శనం కోసం మరురోజు దాకా, లేదా, ఆ తర్వాతి రోజు దాకా నిరీక్షించాల్సిన అవసరం లేకుండా.. టికెట్ పొందిన రోజునే దర్శానికి వెళ్లడానికి టీటీడీ అవకాశం కల్పిస్తోంది. ఇందుకు అనువుగా సాయంత్రం వేళల్లో కూడా శ్రీవాణి టికెట్ల వీఐపీ బ్రేక్ దర్శనాల్ని అనుమతించనున్నారు. దీనివల్ల.. శ్రీవాణి టికెట్లు పొందే భక్తులకు సమయం ఆదాకావడంతో పాటూ.. తిరుమలలో గదులు, కాటేజీలు కేటాయించే విషయంలో ఒత్తిడి తగ్గుతుందని కూడా భావిస్తున్నారు.
ప్రస్తుతం శ్రీవాణి టికెట్ కొన్నవారికి స్వామివారిని దర్శించుకోవడానికి మూడురోజులు పడుతోంది. ఉదయం 10 గంటల నుంచి ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రయారిటీ బేసిస్ మీద తిరుమలలో ఆఫ్ లైన్ లో 800 టికెట్లను విక్రయిస్తారు. రేణిగుంట విమానాశ్రయంలో 200 టికెట్లను విక్రయిస్తారు. ఉదయం పదిగంటలకెల్లా తిరుమలలో శ్రీవాణి టికెట్ కౌంటరు వద్ద ఉండాలంటే. వారు ముందురోజే తిరుమలకు చేరుకోవడం గానీ, లేదా అతి కష్టమ్మీద ఉదయమే వెళ్లడం గానీ జరగాలి. టికెట్ పొందిన తర్వాత మరురోజు ఉదయం దర్శనం కేటాయిస్తారు. అందువల్ల అనివార్యంగా తిరుమలలో బస చేయాల్సి వస్తుంది. కొందరు ఇష్టంగానే ఉంటారు గానీ.. దర్శనం అయితే వెంటనే తిరిగి వెళ్లిపోవాలని అనుకునేవారు కూడా ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో.. చాలా మంది శ్రీవాణి భక్తులకు దర్శనం అనేది రెండు మూడురోజుల వ్యవహారంగా మారుతోంది. దీనికి పరిష్కారంగా సాయంత్రం కూడా శ్రీవాణి బ్రేక్ దర్శన అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
ఈ మేరకు ఆగస్టు 1వ తేదీనుంచి 15వ తేదీ వరకు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఆఫ్ లైన్ లో టికెట్ పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం నాలుగున్నరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్ 1 వద్దకు రిపోర్టు చేయాలి. ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులను సరిదిద్ది.. నవంబరు 1వ తేదీనుంచి పూర్తిస్థాయిలో ఇదే విధానం అమలు చేయాలని అనుకుంటున్నారు.
శ్రీవాణి టికెట్ల కోటాను పెంచుతున్నట్టుగా రెండు రోజుల కిందట వార్తలు వచ్చాయి. అయితే.. అలాంటి ఆలోచన ఏమీ లేదని, యథావిధిగా శ్రీవాణి టికెట్లను ఇవ్వనున్నామని అధికారులు ప్రకటించారు.
‘శ్రీవాణి’కి గుడ్ న్యూస్ : అదేరోజు శ్రీవారి దర్శనభాగ్యం!
Friday, December 5, 2025
