ఏపీలో అధికార కూటమి పార్టీలకు చెందిన నాయకులు, ఆశావహులకు ఇది శుభవార్త. రాష్ట్రంలో ప్రధానమైన 21 దేవాలలయాలకు త్వరలోనే పాలకమండళ్లను ఏర్పాటు చేయబోతున్నట్టుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒక శుభవార్తను వారి చెవిన వేశారు. నామినేటెడ్ పోస్టుల్లో ప్రధానంగా మధ్యశ్రేణి కార్యకర్తలు, నాయకులు ఆశలు పెట్టుకునేది దేవాలయాల పాలకమండళ్ల మీదనే. అలాంటిది.. ఇప్పుడు ఒకేసారి 21 దేవాలయాలకు పాలకమండళ్ల నియామకానికి చంద్రబాబు కసరత్తు పూర్తిచేస్తుండడం ఆశావహులకు ఎంతో ఆనందం కలిగిస్తోంది.
నామినేటెడ్ పోస్టులు ఆశించే వారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఇవాళో రేపో తమకు పదవులు వస్తాయని ఆశపడుతూనే ఉన్నారు. కొన్ని రకాల నామినేటెడ్ పోస్టులు అందరికీ అందేవి కాదు. రాష్ట్రస్థాయి నాయకులకు మాత్రమే పరిమితం అవుతూ ఉంటాయి. అలాంటిది ఆలయాల పాలకమండళ్లు అయితే.. స్థానికంగా చిన్నస్థాయి కార్యకర్తలకు కూడా అవకాశం దక్కుతూ ఉంటుంది. రాష్ట్రంలో 1100 వరకు ఆలయాలకు పాలకమండళ్లు నియమించే అవకాశం ఉంది. ఈ వివరాలను గతంలో సీఎం చంద్రబాబు, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా అనేక సందర్భాల్లో ప్రకటించారు.
ప్రధానమైన వాటిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే ఇప్పటికి పాలకమండలి ఏర్పాటైంది. ఈ ఏడాది శివరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా పూర్తయ్యాయి గానీ.. రాష్ట్రంలో అనేక ముఖ్యమైన శివాలయాలు ఉండగా.. పాలకమండళ్లు లేకుండానే.. ఒక ఏడాది ఉత్సవాలు ముగిసిపోయాయి. త్వరలో శ్రీరామనవమి ఉత్సవాలు కూడా రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రాముడి ఆలయాలన్నీ కళకళ లాడుతాయి. ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమైన 21 ప్రధాన దేవాలయాలకు త్వరలో బోర్డులు ఏర్పాటవుతాయనే ప్రకటన గొప్ప విషయమే.
నిజానికి పాలకమండళ్ల ఏర్పాటు, నామినేటెడ్ పదవుల విషయంలో చంద్రబాబునాయుడు చాలా ఆచితూచి వ్యవహరిస్తుంటారు. కుల సమీకరణాలు మాత్రమే కాదు, సరైన దామాషాలో కూటమిలోని జనసేన, బిజెపిలకు కూడా అవకాశం కల్పించడంతో పాటు.. అన్ని వ్యవహారాలను ఆయన పరిగణనలోకి తీసుకుంటున్నారు. తమ పార్టీకి సంబంధించినంత వరకు, పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసిన వారికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలనేది ఆయన సంకల్పం. అయితే.. అందుకు స్థానిక ఎమ్మెల్యేల నుంచి సిఫారసు ఉత్తరాల మీదనే ఆధారపడుతున్నారు. వారి మాటకు విలువ ఇస్తున్నారు. చాలాచోట్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీకోసం కష్టపడిన వారిని సిఫారసు చేయడంలో జాప్యం వల్ల నియామకాలు ఆలస్యం అవుతున్నట్టుగా చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. వారితో టెలికాన్ఫరెన్సులో.. త్వరలోనే సిఫారసులు పూర్తిచేయాలని ఆయనే ఫాలోఅప్ చేస్తున్నారు. అధినేత స్వయంగా పూనుకోవడంతో.. ఇక ఎలాంటి ఆలస్యం లేకుండా పాలకమండళ్ల నియామకం, నామినేటెడ్ పదవుల పంపకం త్వరత్వరంగా జరగుతాయని ఆశావహులు సంబరపడుతున్నారు.
ఆశావహులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే పాలకమండళ్లు!
Friday, April 18, 2025
