ఇవాళ ప్రపంచమంతా ఐటీ రంగంలో తెలుగు వారు రాజ్యమేలుతున్నారు. ప్రపంచంలో ఐటి రంగంలో ఉన్న మొత్తం భారతీయ నిపుణులను పరిశీలిస్తే గనుక, రాష్ట్రాల వారీ వాటాలు లెక్కతీస్తే తెలుగు వారికే అగ్ర పీఠం దక్కుతుంది. వీళ్ళందరూ ఎలాంటి చెడ్డ విద్యను నేర్చుకుని ఆ స్థాయికి వెళ్లారు? వారికి అప్పట్లో అందుబాటులో ఉన్నది మంచి విద్య కాకపోయినట్లయితే వారు ఏ రకంగా రాణించి ఉండేవారు? ఇలాంటి ప్రశ్నలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్పురిస్తాయో లేదో తెలియదు. విద్యార్థుల నేర్చుకునే సామర్థ్యాలను మెరుగుపరచకుండా, టీచర్ల బోధన ప్రమాణాలను మెరుగుపరచకుండా కేవలం కీర్తి కండూతితో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో తీసుకువచ్చిన సీబీఎస్ఈ విద్యా విధానాన్ని రద్దు చేసినందుకు ఇవాళ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం మంచి విద్యకు గండి కొట్టిందని ఆయన అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి మంచి విద్య అంటే ఏమిటో తెలుసా అనేది ప్రజలకు సందేహంగా ఉంది.
రాష్ట్రంలో సుశిక్షితులైన, విద్యావంతులైన ఉపాధ్యాయ వర్గాన్ని ఘోరంగా అవమానించే విధంగా హైస్కూలు చదువులను తీసుకెళ్లి బైజూస్ చేతిలో పెట్టిన మహనీయుడు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ బైజుస్ విద్యా విధానం మెరుగ్గా ఉన్నదని అనిపిస్తే గనుక, రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరికీ విడతల వారీగా బైజుస్ ద్వారా శిక్షణ ఇప్పించి వారిలోని బోధన ప్రమాణాలను మెరుగుపరచాలి.అంతే తప్ప బైజూస్ వారికి వందల కోట్ల రూపాయల కాంట్రాక్టు ఇచ్చేసి, పిల్లలందరినీ వీడియోలు చూసి పాఠాలు చదువుకోమని చెప్పడం విద్యారంగానికి జగన్ చేసిన అతి పెద్ద చేటు. పిల్లలు అటు పాఠశాల చదువులపై శ్రద్ధ చూపకుండా, ట్యాబ్ చదువుల వైపు అనాసక్తిగా ఉంటూ సర్వభ్రష్టత్వం చెందిపోయారు.
అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ సీబీఎస్ఈ రద్దు గురించి మాట్లాడుతున్నారు. ఆయన గుర్తించాల్సిన మరొక విషయం కూడా ఉంది సి బి ఎస్ ఇ ని పూర్తిగా రద్దు చేస్తామని ప్రభుత్వం అనడం లేదు. దశల వారీగా పిల్లలలో నేర్చుకునే సామర్థ్యాలను పెంచుకుంటూ వచ్చి ఒక క్రమ పద్ధతిలో వారి వికాసానికి బాటలు వేస్తామని మాత్రమే చెబుతోంది. అయినా ఆ మాత్రం శాస్త్రీయ శిక్షణ విధానాన్ని అర్థం చేసుకోగలిగే నేర్పు ఉంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతారు అని ప్రజలు నవ్వుకుంటున్నారు.