వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో రాష్ట్రం మొత్తం అభివృద్ధిని పడకేయించినట్టే.. పోలవరం ప్రాజెక్టును కూడా సర్వనాశనం దిశగానే నడిపించారు. కాఫర్ డ్యాం కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందంటే.. వైసీపీ హయాంలో అధ్వానమైన నిర్వహణ కారణంగానే ప్రాజెక్టు పడకేయడంతో పాటు, అది దెబ్బతినడం కూడా జరిగిందని విమర్శలు వచ్చాయి. పోలవరం పూర్తి చేయడం పట్ల అంకిత భావంతో కూడిన శ్రద్ధ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో పోలవరానికి మంచిరోజులు వచ్చినట్టే కనిపిస్తోంది. 2027 సంవత్సరాంతానికి పోలవరం డ్యామ్ పూర్తి చేయాల్సిందే అని చంద్రబాబునాయుడు తాజాగా లక్ష్యాన్ని నిర్దేశించడం శుభపరిణామం.
ఇప్పటికే 2025 సంవత్సరాంతానికి కొత్త డయాఫ్రం వాల్ కూడా పూర్తిచేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇప్పటికే ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.
పోలవరం ను ఈ విడతలో ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయడానికి కేంద్రం కూడా పూర్తి సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొత్త డీపీఆర్ ను యథాతథంగా ఆమోదించిన తర్వాత నిధుల విడుదలకు పూనుకున్న కేంద్రం నిర్దిష్టమైన డెడ్ లైన్లు విధిస్తోంది. ఇచ్చిన సొమ్ములకు చేసిన పనులు చూపించిన తర్వాతనే తర్వాతి విడత నిధులు ఇస్తాం అంటూ కండిషన్లు పెడుతోంది. ఇలా కేంద్రం కండిషన్లతో కూడిన నిధులు ఇవ్వడం వల్ల పోలవరానికే మంచి జరుగుతోంది. చంద్రబాబు నాయుడు కూడా అదే విధంగా పనులు పూర్తిచేయడానికి డెడ్ లైన్లు విధిస్తూ ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు.
నవంబరు 22, 23 తేదీల్లో తాను పోలవరం పర్యటనకు వస్తానని, ఆలోగా ఎప్పటికి పనులు పూర్తిచేయగలమో అధికారులు తేల్చాలని, ఆరోజున రాఫ్ట్ర ప్రజలకు చెప్పాల్సి ఉంటుందని చంద్రబాబు అంటున్నారు. పనులు పూర్తికాకపోయేట్లయితే కనీసం ఎత్తుకు తగ్గట్టుగా 30,40 శాతం నీళ్లు నిలబెట్టే మార్గాలు చూడాలని అంటున్నారు. పదిరోజుల్లోగా పనుల పూర్తికి సంబంధించిన షెడ్యూలు తనకు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించడం విశేషం.
అధికారులు చెబుతున్న ప్రకారం 2026 మార్చి నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావాలి. ప్రధాన డ్యాం ఆ తర్వాత మొదలెడితే 2028 మార్చికి పూర్తవుతుంది. రెండు పనులను సమాంతరంగా చేపడితే గనుక.. 2027 నాటికే పూర్తిచేయవచ్చు అని అధికారులు చెబుతున్నారు.
పనుల గమనాన్ని, ప్రభుత్వం వాటిని ఫాలో అప్ చేస్తున్న తీరును గమనిస్తే.. 2027, 28 నాటికి అమరావతి రాజధాని, పోలవరం డ్యామ్, విశాఖలో రైల్వే జోన్ అన్ని పనులు కూడా తుదిదశల్లో ఉంటాయని అనిపిస్తోంది. రాష్ట్ర పురోగతిపై ప్రజలకు నమ్మకం చిక్కుతోంది.
పోలవరానికి మంచి రోజులు : గ్రహణం వీడినట్టే!
Wednesday, December 25, 2024