రాష్ట్రంలోని పేదల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు పీ4 పేరుతో ఒక సరికొత్త ఆలోచనను అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. తద్వారా సంపన్నుల్లో దాతృత్వ గుణం ఉన్నవారి ద్వారా.. పేదలకు సాయం అందించాలనేది ప్రణాళిక. లబ్ధి పొందుతున్న పేదలను బంగారు కుటుంబాలు గానూ, దాతలను మార్గదర్శులు గాను వ్యవహరిస్తున్నారు. ఈ పథకాన్ని మంగళవారం నాడు పూర్తి స్థాయిలో ప్రారంభించారు. ఆ సమయానికి రాష్ట్రంలో 15 లక్షల బంగారు కుటుంబాలు ఎంపిక చేసి ఆదుకోవాలని, మార్గదర్శులుగా 5 లక్షల మందిని ఎంపిక చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అనుకున్న స్థాయిలో ప్రభుత్వం చాలా ఘనంగా దీనిని ప్రారంభించింది గానీ. ఈ గణాంకాల దగ్గరే ఇప్పుడు కొంచం తేడా వచ్చింది.
ఆగస్టు 15వ తేదీ నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేయాలని చంద్రబాబు సంకల్పించారు. అయితే.. పథకం పూర్తిస్థాయి ప్రారంభం అయ్యేనాటికి మొత్తం 13,40,697 బంగారు కుటుంబాలు ఎంపిక అయినట్టుగా చంద్రబాబు లెక్క చెప్పారు. అంటే లక్ష్యానికి కేవలం పదిశాతం దూరంలోనే ఆగిపోయిందన్నమాట. దీనిని పాజిటివ్ సంకేతంగానే భావించాలి. అదే సమయంలో.. ఈ సమయానికి 5లక్షల మంది మార్గదర్శులను గుర్తించాలని ప్రభుత్వం అనుకున్నది గానీ, ఇప్టపికి 1,41,977 మంది మాత్రమే నమోదు అయ్యారు. లక్ష్యంలో మూడోవంతు కంటె చాలా తక్కువగా ఉండడం గమనార్హం.
మార్గదర్శులుగా వితరణ చేయడానికి ఎవ్వరినీ బలవంతం చేయడంలేదని, ఇది కేవలం మనసున్న వారికోసమే ఏర్పాటుచేసిన పథకం అని చంద్రబాబునాయుడు అంటున్నారు. అలా ప్రభుత్వ పరమైన ఒత్తిడి ఏదీ లేకపోవడం వల్ల.. స్వచ్ఛందంగా వచ్చే కొందరు మాత్రమే ముందుకొస్తున్నట్టుగా పలువురు భావిస్తున్నారు. అదే సమయంలో మార్గదర్శుల సంఖ్య అనుకున్నంతగా లేకపోవడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పథకం నీరుగారిపోయేలా చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమవంతు కుట్రలు తాము అమలు చేస్తూనే ఉంది. జగన్ దళాలతో పాటు సాక్షి మీడియాలో ఈ పీ4 పథకం గురించి అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. అసలు దాతలను మార్గదర్శి అనే పదంతో వ్యవహరించడాన్నే వారు తప్పు పడుతున్నారు. రామోజీరావు చిట్ ఫండ్ వ్యాపారానికి మార్కెటింగ్ చేస్తున్నారని కుటిల విమర్శలు వినిపిస్తున్నారు. అంతేకాదు మార్గదర్శులుగా ముందుకు వస్తున్న వారిని, అలా చేయవద్దంటూ వైసీపీ స్థానిక నాయకులు బెదిరిస్తున్నట్టుగా కూడా గుసగుసలున్నాయి. సంపన్నులు మార్గదర్శులుగా ముందుకు రావాలని ఉన్నా సరే.. వైసీపీ వారికి భయపడుతున్నారు. భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం ఏదో ఒక నాటికి ఏర్పడితే.. అప్పుడు తమను టార్గెట్ చేసి తమ వ్యాపారాను దెబ్బతీస్తారనే భయం వారిని వెన్నాడుతోంది. నలుగురికి మంచి చేయడానికి వెళితే.. వైసీపీ తమను పామై కాటేస్తుందేమో అని వారు జంకుతున్నారు. ప్రభుత్వం ఇలాంటి భయాలను దూరం చేయగలిగితే.. మార్గదర్శుల పరంగా కూడా లక్ష్యాన్ని అందుకోవడ పెద్ద విషయం కానేకాదని పలువురు విశ్లేషిస్తున్నారు.
