ఘర్ వాపసీ అనేది కేవలం మతాలకు సంబంధించిన వ్యవహారం మాత్రమే అని మనం అనుకుంటాం. కానీ, రాజకీయాల్లో కూడా ఘర్ వాపసీ ఉంటుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆ పదం బలంగా వినిపిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి ఘర్ వాపసీ కోసం, పాత తమ్ముళ్లు ఉత్సాహ పడుతున్నారు. అయితే.. కష్ట కాలంలో వదలి వెళ్లి, అధికారంలోకి వచ్చిన తరువాత తిరిగి వచ్చే అవకాశవాదుల్ని రానివ్వ వద్దని పలువురు గొడవ చేస్తున్నారు.
ఇలాంటి పరిణామాలు ఉంటాయని ముందే ఊహించారేమో.. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష 2022 లో జరిగిన మహానాడు సభల్లోనే ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఒకసారి పార్టీ వదలి వెళ్లిన వారిని మళ్లీ చేర్చుకోవద్దు అని చంద్రబాబుకు సూచించారు. ఎన్నికలకు ముందు.. జగన్ ఓటమి సంకేతాలు చాలా బలంగా కనిపించడంతో కొందరు నాయకులు వెనక్కు వచ్చేసారు. వారిని చంద్రబాబు అనుమతించారు. ఎన్నికల ముందు కూడా మీన మేషాలు లెక్కించి, అధికారం దక్కిన తరువాత రాదలచుకునే వారి పట్ల కఠినంగా ఉండాలనే డిమాండ్లను పార్టీ నాయకులు వినిపిస్తున్నారు.
గుంటూరు వెస్ట్ నుంచి 2019లో టిడిపి తరఫున ఎంఎల్ఏ గా గెలిచి, తరువాత వైసీపీ లోకి ఫిరాయించిన మధ్ధాలి గిరి విషయంలో ఈ ఘర్ వాపసీ చర్చ మళ్ళీ తెరపైకి వస్తోంది. గిరి టీడీపీ లో చేరాలని అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ గుంటూరు జిల్లా నాయకులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ నో ఆంటే జనసేన లో చేరడానికి.. గిరి ప్లాన్ చేస్తున్నారు.అసలు కూటమి పార్టీలలోకి రానివ్వవద్దని పలువురు వాదిస్తున్నారు. మరి చంద్రబాబు వ్యూహ రాజకీయాలు ఎలా ఉంటాయో.. గిరి భవిష్యత్తు ఏమిటో వేచిచూడాలి.