పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు? పోలవరం ప్రాజెక్టు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యావసాయిక పురోగతికి సంబంధించినంత వరకు జీవనాడి అనేది అందరికీ తెలుసు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పనులు ఎలా జరుగుతున్నాయో, ఎంతెంత జరుగుతున్నాయో రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా అవగాహన కలుగుతూ ఉండేది. ప్రతి అప్ డేట్ ప్రజల్లో ప్రతి ఒక్కరికీ తెలిసేది. ప్రతి సోమవారం.. పోలవారం అన్నట్టుగా చంద్రబాబునాయుడు ఆ ప్రాజెక్టు పనులు గురించి క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. అంత శ్రద్ధగా అధికారులను వెంటపడుతూ పనులు చేయిస్తూ వచ్చినందువల్ల మాత్రమే.. చంద్రబాబునాయుడు పదవీకాలం పూర్తయ్యే సమయానికి ఆ ప్రాజెక్టు 75 శాతం వరకు పూర్తయింది.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే చంద్రబాబు ఎక్కువగా శ్రద్ధ పెట్టిన అనేక అంశాలపై పగబట్టినట్టుగానే పోలవరంపై కూడా పగబట్టారు. ఆ పనులను నిలిపివేయించారు. కాంట్రాక్టర్లను బెదిరించి పక్కకు తప్పించారు. రివర్స్ టెండర్లు అంటూ పెద్ద డ్రామా నడిపించి.. తమకు అత్యంత దగ్గరివారైన మేఘా కంపెనీకి కాంట్రాక్టును కట్టబెట్టారు. రివర్స్ టెండరింగ్ వ్యవహారం ద్వారా ఇన్ని కోట్ల రూపాయలు మిగలబెట్టాం అంటూ ఒక మాయమాటలు వల్లించారు.
అప్పటినుంచి పోలవరం పనులు పూర్తిగా పడకేశాయి. బూతులు తిట్టడం తప్ప మరోటి తెలియని అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నంత కాలం.. పోలవరం ప్రాజెక్టును వచ్చేనెలలో పూర్తిచేసేసి నీళ్లు వదిలేస్తాం అన్నంత సునాయాసంగా కబుర్లు చెబుతూ గడిపారు. అంబటి రాంబాబు మంత్రి అయిన తర్వాత.. అది కూడా లేదు. అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశమే లేదు.. అన్నట్టుగా ఆయన మాటలు ధ్వనిస్తుంటాయి. అయితే అందుకు పూర్తిపాపం చంద్రబాబుదే అన్నట్టుగా ఆయన నిందలు వేస్తుంటారు.
అయితే తాజాగా ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేంద్రమంత్రి గడ్కరీ పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్రానికి మేలు చేసే ప్రాజెక్టుకోసం కేంద్రం ఇప్పటిదాకా 60 వేల కోట్లు విడుదల చేసినా జగన్ సర్కారు పూర్తిచేయకపోవడం చేతగానితనం అని విమర్శించారు. ఏటా అనవసరంగా 1300 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగా తానే పోలవరం ప్రాజెక్టును నాలుగు సార్లు సందర్శించానని అంటూ, దానిని పూర్తి చేయడంలో జగన్ సర్కారు ఫెయిలైందని చెప్పారు. మరి రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరాన్ని కూడా జగన్ సర్కారు ఏ రకంగా విధ్వంసం చేసిందో ప్రజలు అర్థం చేసుకుంటారా? ధ్వంసరచన తమ జీవనశైలిగా మార్చుకున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారా అనేది వేచిచూడాలి.