తమ పరిధిలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా సరే.. వెంటనే రంగంలోకి దిగిపోయి.. చిలవలు పలవలు చేర్చి.. గోరంతను కొండంతలుగా మార్చి.. ఎలాంటి ప్రచారం చేస్తే స్పైసీగా ప్రజల్లోకి వెళుతుందో.. అలాంటి తప్పుడు ప్రచారం ద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనుకోవడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఈ విషయంలో అటు తిరుపతి నుంచి ఇటు శ్రీకాకుళం వరకూ పార్టీ నాయకులు అందరికీ ఒకే రకమైన కురచబుద్ధి అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఒక విద్యార్థినిపై దాడి జరిగితే.. ఆమె మీద సామూహిక అత్యాచారం జరిగినట్టుగా వక్రీకరించి ప్రచారం చేయడం ద్వారా.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. గతంలో తిరుపతిలో కూడా ఇదే తరహా వారి దుర్మార్గం వెలుగులోకి వచ్చింది.
శ్రీకాకుళం జిల్లాలో డిగ్రీ చదువుతున్న విద్యార్థినిపై దాడి జరిగింది. వెంటనే వైసీపీ నాయకులు రాబందుల్లా వాలిపోయారు. మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు మరికొందరు వైసీపీ నాయకులు పరామర్శల పేరుతో వెళ్లి.. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్టుగా తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారని, ఈ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చిన వార్డెన్ ను ఇప్పటికే సస్పెండ్ చేశామని హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాకు వెల్లడించారు. విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని వైద్యులు కూడా నిర్ధరించినట్లు ఆమె వెల్లడించారు. వైసీపీ నాయకులు కనీసం మానవత్వం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో తిరుపతిలో కూడా సేమ్ టూ సేమ్ ఇలాంటి అరాచకమే జరిగింది. ఇక్కడి ధర్మాన కృష్ణదాసు పాత్రన అక్కడ చెవిరెడ్డి భాస్కర రెడ్డి పోషించారు. తిరుపతి సమీపం యర్రావారి పాలెం పరిధిలో ఓ బాలికపై దాడి జరిగింది. తిరుపతి ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. అయితే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఆ బాలికపై లైంగిక దాడి జరిగినట్టుగా మీడియాలో తప్పుడుప్రచారం చేశారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఆయన అబద్ధాలు చెప్పడమూ, సాక్షి పత్రిక దానిని ప్రముఖంగా ప్రచురించడమూ ఆటోమేటిగ్గా జరిగిపోయింది. బాలిక తండ్రి ఫిర్యాదుతో చెవిరెడ్డి మీద పోక్సో కేసు నమోదు అయింది. ఆయన ఇప్పటికీ ఆ కేసు విచారణను ఎదుర్కొంటున్నారు. తన మీద కేసును కొట్టివేయాల్సిందిగా ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసినప్పటికీ.. ఆయన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది.
ఇప్పుడు డిగ్రీ విద్యార్థిని మీద సామూహిక అత్యాచారం జరిగినట్టుగా తప్పుడు ప్రచారానికి కారణమైన మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు తదితరుల మీద కూడా కేసులు నమోదుచేసి విచారించాలని ప్రజలు భావిస్తున్నారు.
సిక్కోలు నుంచి తిరుపతి దాకా.. అవే కురచ బుద్ధులు!
Friday, April 18, 2025
