ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రజలు మళ్లీ పాత చంద్రబాబునాయుడు పనితీరును చూడబోతున్నారు. ఒకప్పట్లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ‘నేను నిద్రపోను- మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అంటూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తూ పనిచేయించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో చంద్రబాబునాయుడు ఎడ్మినిస్ట్రేషన్ పూర్తిగా యుద్ధరంగంలాగా సాగుతుండేది. ఆకస్మిక తనిఖీలతో చంద్రబాబునాయుడు అధికార యంత్రాంగాన్ని నిత్యం అప్రమత్తంగా ఉంచేవారు. దాని సత్ఫలితాలు కూడా కనిపిస్తుండేవి. అచ్చంగా అదే మాదిరిగా కాకపోయినప్పటికీ.. స్వచ్ఛ భారత్ విషయంలో అప్పటి పాతచంద్రబాబు పనితీరును రాష్ట్రప్రజలు మళ్లీ రుచిచూడబోతున్నారు. స్వచ్ఛభారత్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించబోతున్నామని, గ్రామాలు, పట్టణాలను, మన అన్ని పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలని.. ఈ విషయంలో తాను అక్టోబరు 2 తర్వాత స్వచ్ఛభారత్ నిర్వహణను పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు ప్రారంభిస్తానని చంద్రబాబునాయుడు ప్రకటించారు.
స్వచ్ఛభారత్ విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటూ ఉంది. తాజాగా తణుకు మునిసిపాలిటీలో ముఖ్యమంత్రి స్వచ్ఛభారత్ లో పాల్గొన్నారు. మనందరి ప్రాణాలను కాపాడేది పారిశుధ్య కార్మికులే అని చంద్రబాబునాయుడు కితాబు ఇచ్చారు. స్వచ్ఛభారత్ విషయంలో పంచాయతీలు, కార్పొరేషన్లు చాలా శ్రద్ధగా ఉండాలని ఆయన పిలుపు ఇచ్చారు. అక్టోబరు 2వ తేదీ తర్వాత.. ఈ విషయంలో తాను ఆకస్మిక తనిఖీలకు వస్తుంటానని అన్నారు. ఎప్పుడు ఏ గ్రామానికి, లేదా పట్టణానికి రాబోయేది ముందుగా ప్రకటించేది ఉండదని.. కేవలం రెండు మూడు గంటల ముందు మాత్రమే ఎక్కడకు వెళుతున్నామో ప్రకటించి.. అక్కడికి పర్యటించి.. స్వచ్ఛ భారత్ అమలు పరిశీలిస్తానని చంద్రబాబునాయుడు అన్నారు.
గతంలో చంద్రబాబునాయుడు ఆకస్మిక తనిఖీలు అంటే.. అధికార యంత్రాంగం గుండెల్లో రైళ్లు పరుగెడుతుండేవి. ఆయన ఎప్పుడు ఏ కార్యాలయం తనిఖీకి వస్తారో తెలియదు.. అంతా అకస్మాత్తుగా జరిగేది. రాష్ట్రమంతా ఎంతో అప్రమత్తంగా ఉండేది. చంద్రబాబు చెప్పినట్టే.. ‘ఆయన నిద్రపోకుండా.. అధికారులను నిద్రపోనివ్వకుండా’ పనిచేసేవారంటే అతిశయోక్తి కాదు. కాకపోతే.. ఇప్పుడు ఆయన పంథా మారింది. స్వచ్ఛభారత్ విషయంలో మరింతశ్రద్ధగా రాష్ట్రం ఉండాలనే అభిలాషను ఆయన వ్యక్తం చేస్తున్నారు. అందుకే స్వచ్ఛ భారత్ విషయంలో గ్రామాలను, పట్టణాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని చంద్రబాబు చెప్పడం మంచి పరిణామం అని అందరూ భావిస్తున్నారు. ప్రజారోగ్యం మెరుగుపడడానికి పరిశుభ్రతే ప్రధానం గనుక.. చంద్రబాబునాయుడు స్వచ్ఛభారత్ విషయంలో ఈ స్థాయిలో దృష్టిపెట్టడం వల్ల ప్రజల్లో అవగాహన పెరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు.
అక్టోబరు 2నుంచి ఇక పాత చంద్రబాబే!
Sunday, March 16, 2025
