సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. సరిగ్గా ఎన్నికలకు ముందు అభ్యర్థులను ఎంపిక చేస్తున్న సీజన్ లోనే ఆయన వైసీపీని వీడి తెలుగుదేశంలోకి వచ్చారు. కొన్ని నెలల వ్యవధిలోనే తెలుగుదేశం నాయకురాలిని ఈ రేంజిలో వేధించడమూ, భ్రష్టుపట్టిపోవడమూ రెండూ జరిగిపోయాయి. అయితే కోనేటి ఆదిమూలం ఇలాంటి చాటు మాటు వ్యవహారిలు నడిపించడం అనేది ఇప్పుడు కొత్త కాదని.. ఆయన గత అయిదేళ్లుగా.. అంటే జగన్ జమానాలో ఎమ్మెల్యే అయినప్పటినుంచి కూడా ఇదే పనిలో ఉన్నారని పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. తిరుపతి భీమాస్ డీలక్స్ హోటల్ లో రూం నెంబరు 109 అనేది ఎమ్మెల్యే రాసలీలలకు అయిదేళ్లకు పైగా పర్మినెంటు అడ్డగా ఉన్నదని తెలుస్తోంది.
కోనేటి ఆదిమూలం ను పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత.. ఆయనకు మద్దతుగా ఇద్దరు కూతుళ్లు కూడా మీడియా ముందుకు వచ్చి, తమ తండ్రి కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని అన్నారు. కానీ పరిస్థితుల్ని గమనిస్తే అలాంటి వాతావరణం లేదు. మహిళా నాయకురాలి ఆరోపణల నేపథ్యంలో.. పార్టీ సీరియస్ గా తీసుకోవడంతో పోలీసులు ప్రత్యేకంగా తిరుపతి భీమాస్ డీలక్స్ హోటల్ కు వెళ్లి సీసీ టీవీ ఫుటేజీలను గమనించినప్పుడు ఆదిమూలం అక్కడకు తరచూ వస్తూ.. అదే తన అడ్డాగా కొనసాగిస్తున్నట్లు తేలింది. అయిదేళ్ల కిందట ఒక మాజీ జడ్పీటీసీ సభ్యుడి పేరుతో రూం బుక్ చేసుకుని.. అప్పటినుంచి తన రాసలీలల కేంద్రంగా మార్చుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు.
తెలుగుదేశం పార్టీని నమ్మి ఓట్లు వేసి గెలిపించిన సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు.. ఎమ్మెల్యేను పక్కన పెటారనే లోటు తెలియకుండా.. అభివృద్ధి పనుల విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చంద్రబాబునాయుడు ఇప్పటికే నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తోంది. కోనేటి ఆదిమూలం రాజకీయ చరిత్ర ఇక్కడితో క్లోజ్ అయినట్టుగా కూడా పలువురు భావిస్తున్నారు.
వైఎస్ జగన్ హయాంలో ఆయన పార్టీకి చెందిన అనేక మంది ప్రజాప్రతినిధుల మీద ఇలాంటి లైంగిక వేధింపుల ఆరోపణలు పుష్కలంగా వచ్చాయి. కానీ జగన్ ఏ ఒక్కరి మీద కూడా చర్య తీసుకున్న దాఖలాలు లేవు. పార్టీ ఎంపీ నగ్న వీడియో కాల్స్ తో పార్టీ పరువును బజారుకీడ్చినా జగన్ చీమ కుట్టినట్టుగా కూడా స్పందించలేదు. జగన్ ఎటూ స్పందించరు అని తెలిసే.. కోనేటి ఆదిమూలం విషయంలో ఆ పార్టీలో ఆయన వేధింపులు భరించిన వారు కంప్లయింటు చేసి ఉండకపోవచ్చునని అనుకుంటున్నారు. తాజాగా ఆయన మీద ఆరోపణలు రాగానే.. చంద్రబాబు కోనేటి ఆదిమూలం ను సస్పెండ్ చేసి.. మహిళల రక్షణకు, గౌరవం కాపాడడానికి తమ పార్టీ ఎంతగా కట్టుబడి ఉన్నదో నిరూపించుకున్నారు.