తమ పార్టీని గెలిపిస్తే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రకటించారు. ప్రజలు నమ్మి గెలిపించారు. ఉచితం అంటే అచ్చంగా ఉచితం మాత్రమే చంద్రబాబు నాయుడు కొత్త ఇసుక విధానాన్ని తీసుకు వచ్చిన తర్వాత ఒకటి రెండు తాజా మార్పులతో పూర్తి ఉచితంగా ఎలాంటి సీనరేజీ చార్జీలు కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రజలు తీసుకువెళ్లడానికి సరికొత్త నిర్ణయాన్ని ప్రకటించారు. ఇది ఎంత అద్భుతంగా ఉన్నదంటే తమ నిర్మాణ అవసరాలకు ప్రజలు నది వద్దకు ట్రాక్టర్లు తీసుకుని వెళ్లి, ఇసుక నింపుకొని యథేచ్ఛగా తీసుకెళ్లి పోవచ్చు. ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అసలైన ఉచిత విధానాన్ని చంద్రబాబు తీసుకువచ్చారని ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
స్వయంగా ఇసుకతవ్వి ట్రాక్టర్లలో ఎడ్లబండ్లలో నింపుకోలేని వారు మాత్రం అక్కడ తవ్వకానికి ఉద్దేశించిన కాంట్రాక్టర్ల నుంచి తవ్వినందుకుగాను వారికి నామమాత్రపు ఫీజు ఒక టన్నుకు 90 నుంచి 100 రూపాయల వరకు చెల్లించి తీసుకొని తీసుకువెళ్లవచ్చు. రవాణా అనేది పూర్తిగా ప్రజల ఇష్టం. వారి ఇష్టం వచ్చిన పద్ధతిలో తీసుకువెళ్లవచ్చు. అది ప్రభుత్వం నిర్దేశించడం లేదు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక విధానాన్ని మార్చివేసి ప్రైవేటు సంస్థలకు అప్పగించి ప్రజల నెత్తిన భారం వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఏడాదికి ప్రభుత్వానికి 750 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని చూపించి.. అదనంగా వేల కోట్ల రూపాయల ఇసుకను తవ్వించి, అమ్మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ సమయంలో కాజేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇసుక, లిక్కర్ రెండు వ్యాపారాలలో కూడా కనీసం డిజిటల్ లావాదేవీలు కూడా లేకుండా విచ్చలవిడితనాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రోత్సహించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక అందజేస్తుండగా జగన్మోహన్ రెడ్డిలో వణుకు మొదలవుతోంది. ఉచితం పేరుతో దోచుకుంటున్నారంటూ ఆయన అర్థం లేని ప్రేలాపన చేస్తున్నారు. ప్రభుత్వం మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వాస్తవం క్షేత్ర స్థాయిలో ఈ ఉచిత ఇసుక విధానాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలకు తెలుస్తుంది. వారి అనుభవం ముందు జగన్ చేసే ఆరోపణలు గాలికి కొట్టుకుపోతాయి. ఉచితం అంటే అసలు సిసలు ఉచితంగానే ప్రజలు ఇసుక తీసుకువెళ్లగల విధానానికి ప్రజల నుంచి ఆమోదం లభిస్తోంది.
ఉచితం అంటే అచ్చంగా ఉచితమే!
Sunday, December 22, 2024