మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతతో సాయంత్రం ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన మన్మోహన్ సింగ్‌కు ఐసీయూలో చికిత్స అందించారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్.. గురువారం రాత్రి ఇంట్లో ఒక్కసారిగా స్పృహకోల్పోవటంతో.. రాత్రి 8:06 గంటలకు హుటాహుటిన ఎయిమ్స్‌లోని మెడికల్ ఎమర్జెన్సీ ఎయిమ్స్ కి తరలించారు.
అయితే.. మన్మోహన్ సింగ్ ఆరోగ్యం పూర్తిగా విషమించటంతో.. ఆయన రాత్రి 9:51 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఎయిమ్స్ వైద్యబృందం ప్రకటించింది.మన్మోహన్ సింగ్ మరణ వార్త విని.. రాజకీయ ప్రముఖులు ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వంటి నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో.. శుక్రవారం (డిసెంబర్ 27న) బెళగావిలో జరగాల్సిన కాంగ్రెస్ ర్యాలీని అధిష్ఠానం రద్దు చేసుకుంది.
మన్మోహన్ సింగ్ మరణవార్త విని కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో పాటు అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీకి వచ్చారు. మన్మోహన్ సింగ్ మరణంపై పలువురు నేతలు ట్విట్టర్ వేదికగా కూడా స్పందిస్తూ.. ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
1932 సెప్టెంబర్ 26న అవిభక్త భారత్‌లోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన మన్మోహన్ సింగ్.. 2004 నుంచి 2014 వరకు సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా భారతదేశానికి ఎన్నో సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధానుల్లో మన్మోహన్ కూడా ఒకరు. 1991 నుంచి 1996 వరకు పీవీ కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా సేవలందించారు. ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్‌కు పేరుంది. 1991 అక్టోబర్‌లో తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టిన మన్మోహన్.. ఐదుసార్లు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.