జగన్మోహన్ రెడ్డిలో రోజురోజుకూ అసహనం పెరిగిపోతున్నట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు పరిపాలన సాగుతున్న తీరు, నిర్మాణాత్మకంగా జరగుతున్న అభివృద్ధి, అమరావతి రాజధాని నగర నిర్మాణానికి జరుగుతున్న కసరత్తు, పరిశ్రమలు రావడానికి మొగ్గు చూపుతుండడం, ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారా? భయపడుతున్నారా? అనేది అర్థం కావడం లేదు. కానీ.. అపరిమితమైన అసహనానికి గురవుతున్నారు. తల్లికి వందనం, రైతు భరోసా, ఫీజు రీఇంబర్స్ మెంట్ వంటివి ఏవీ ఇంకా ప్రజలకు అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కానీ జగన్ ఏదో ఆత్రుతలో ఇలా మాట్లాడుతుండవచ్చు గానీ.. ఆయన తెలుసుకోవాల్సిన సంగతి ఒకటుంది. ప్రజల్లో ఏదైనా ఒక అంశం మీద నిర్దిష్టంగా భయం, అనుమానం ఉన్నప్పుడు దానికోసం పార్టీలు గళం విప్పితే ఆదరణ దక్కుతుంది. ప్రజల్లో ఎలాంటి టెన్షను, ఆలోచన లేని అంశాల మీద పార్టీలు పోరాటస్వరం వినిపిస్తే అభాసుపాలవుతారు. ఫరెగ్జాంపుల్.. జగన్ పాలనలో రాష్ట్రమంతా రోడ్లు దరిద్రంగా తయారయ్యాయి. ప్రజలంతా తిట్టుకుంటున్నారు. ఆ సమస్యను భుజానికెత్తుకుని జనసేన ప్రజాదరణ సాధించింది. ఇప్పుడు జగన్ ఆ కనీస ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం, రైతుభరోసా, ఫీజు రీఇంబర్స్ మెంట్ ఇవ్వదు అని ప్రజలెవ్వరూ భయపడ్డం లేదు, ఆలోచించడంలేదు, అనుమానించడం లేదు. జగన్ అనవసరంగా గోల చేస్తున్నారు.
సాధారణంగా నాయకుల్లో ఓటమి పాలైనప్పుడు అసహనం ఎక్కువగా ఉంటుంది. కాలక్రమంలో వాస్తవాల్ని అర్థం చేసుకుంటూ అసహనం తగ్గించుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డిలో రోజులు గడుస్తున్న కొద్దీ అసహనం మరింతగా పెరిగిపోతోంది. 60 రోజుల ప్రభుత్వానికి అపశకునాలు పలుకుతున్నారు. రాష్ట్రపతి పాలన అంటూ చేసిన యాగీకి ప్రజల మద్దతు దక్కకపోగా.. ఇప్పుడు పథకాల పేర్లతో గోల చేస్తున్నారు. అవేమీ ప్రభుత్వం ఇవ్వము అని చెప్పడం లేదు.. జగన్ కంటె మరింత పద్ధతిగా ఇస్తామంటున్నారు. ప్రజలు వేచిచూడగలిగినప్పటికీ.. జగన్ అసహనం ఈలోగానే ప్రభుత్వంపై బురద చల్లేలా చేస్తోంది.
60 రోజులేగా.. ఆగలేకపోతున్నావా జగన్!
Sunday, December 22, 2024